రాజధానిలో దోపిడీని తవ్వితీస్తాం:చంద్రబాబుకు కాకాణి వార్నింగ్

Mon Jan 20 2020 22:38:36 GMT+0530 (IST)

kakani Govardhan On Chandrababu Naidu

టీడీపీ జాతీయ అధ్యక్షులు - ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ  ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో చంద్రబాబుకు చెందిన వ్యక్తులు తక్కువ ధరకే వేల ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు.2014లో ఆయన అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోకుండా తనకు అనుకూలంగా మార్చుకొని ఈ ప్రాంతంలోని పేద రైతులను - ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వికేంద్రీకరణకు అందరూ మద్దతు ఇస్తున్నారని కానీ చంద్రబాబు - టీడీపీ మాత్రం తమ అక్రమ ఆస్తులు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.

చంద్రబాబుకు సుదీర్ఘ పాలనా అనుభవం ఉందనే ఉద్దేశ్యంతో విభజన సమయంలో ఆయనకు అధికారం ఇస్తే ఎన్ని రకాలుగా అవినీతిని చేయవచ్చునో అన్ని విధాలుగా చేసి చూపించారన్నారు. అయిదేళ్ల కాలంలో ఎన్నో స్కాంలు చేశారని ఆరోపించారు.

రాజధాని ఎక్కడ వస్తుందో తన అనుచరులకు ముందుగానే లీక్ ఇచ్చారని అక్కడి పేద రైతుల భూములు కొట్టేశారన్నారు. తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారన్నారు.

వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయనకు సొంత ప్రయోజనాలు తప్ప ప్రజలు అవసరం లేదన్నారు. మూడు పంటు పండే భూముల్లో రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారన్నారు. నారాయణ వద్ద పని చేసే అటెండర్లు క్లర్క్స్ కూడా పదుల కొద్ది ఎకరాలు కొనుగోలు చేశారన్నారు.
 
చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని నిలదీశారు. 800 మంది తెల్లరేషన్ కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా చూపిస్తున్నారన్నారు. వారు చంద్రబాబు బినామీలేనని ఆరోపించారు. టీడీపీ నేతల దోపిడీని తవ్వితీస్తామని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించారు.