Begin typing your search above and press return to search.

మూడోసారి సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ.. మరోవైపు సునీత సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   10 March 2023 12:11 PM GMT
మూడోసారి సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ.. మరోవైపు సునీత సంచలన నిర్ణయం!
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ప్రస్తుతం వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.

ఈ కేసు విచారణ తెలంగాణకు మారాక సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని రెండుసార్లు విచారించింది. అలాగే ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి తదితరులను కూడా కడప జైలు నుంచి హైదరాబాద్‌ కు పిలిపించుకుని విచారించింది.

వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 5 రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. మార్చి 10న హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముచ్చటగా మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24 అవినాష్‌ సీబీఐ విచారణకు హైదరాబాద్‌ లో హాజరైన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా.. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ మార్చి 9న తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. సీబీఐ ఎవరో చెప్పినట్టు విచారణ చేస్తోందని.. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని.. తననే నేరస్తుడనని నిరూపించేలా సీబీఐ విచారణ సాగుతోందని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌ లో పలు అభ్యంతరాలను లేవనెత్తారు.

అంతేకాకుండా వైఎస్‌ వివేకానందరెడ్డి చెక్‌ పవర్‌ ను ఆయన కుటుంబ సభ్యులు రద్దు చేశారని, ఆయనకు రెండో వివాహమైందని.. కుమారుడు కూడా ఉన్నారని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌ లో సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆస్తి అంతా రెండో భార్య కుమారుడు పేరు రాస్తారని భావించిన సునీత, ఆమె భర్తే వివేకాను హత్య చేశారని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌ లో సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వివేకా కుమార్తె సునీత.. చంద్రబాబు, బీటెక్‌ రవి ప్రభావాలను లోనై తనపైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వేసిన రిట్‌ పిటిషన్‌ లో వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇంప్లీడ్‌ కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆమె ఇంప్లీడ్‌ పిటిషన్‌ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు.

మరోవైపు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ తెలంగాణ హైకోర్టులో మార్చి 10న మధ్యాహ్న సమయానికి విచారణకు రాలేదు. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరుకాక తప్పలేదు.

మరోవైపు ఈ కేసులో చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ ఖైదీలుగా ఉన్న సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డితో పాటు గంగిరెడ్డి, దస్తగిరి మార్చి 10 సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి మార్చి 12న కడపలో విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటికే ఫిబ్రవరి 24న హైదరాబాద్‌ లోని సీబీఐ కార్యాలయంలో ఏకంగా ఐదున్నర గంటలపాటు అవినాష్‌ రెడ్డిని సీబీఐ విచారించింది. ఆయనను తొలిసారి జనవరి 28న సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

కాగా 2019 ఎన్నికల ముందు మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగింది. కడప లోక్‌ సభ సీటును వైఎస్‌ విజయమ్మ లేదా వైఎస్‌ షర్మిలకు ఇవ్వాలని వైఎస్‌ వివేకానందరెడ్డి సూచించారని వార్తలు వచ్చాయి. అయితే కడప ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి.. వివేకా నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారే వైఎస్‌ వివేకాను హత్య చేయించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. సీబీఐ కూడా తన చార్జిషీట్‌ లో ఇవే అంశాలను పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.