Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల‌వ‌ర‌ప‌డేలా ఇంకో బాంబు పేల్చిన రేవంత్‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 5:57 PM GMT
కేసీఆర్ క‌ల‌వ‌ర‌ప‌డేలా ఇంకో బాంబు పేల్చిన రేవంత్‌
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు కొద్దిరోజుల‌ ముందు టీఆర్ ఎస్‌ కు భారీ షాక్ తగిలినంత ప‌న‌యిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి మహేందర్ రెడ్డికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తనను చిన్నచూపు చూస్తున్నారని కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. ఆ లేఖలో తన రాజీనామాకు దారితీసిన కారణాలను పేర్కొన్నారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేయడంపై టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. డిసెంబర్‌ 7లోపు రెండు వికెట్లు పడతాయని తాను చెప్పానని, ఇప్పడు రెండు కాదు మూడు వికెట్లు పడతాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ నెల 23న మేడ్చల్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్ద‌రు ఎంపీలు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు, తాను ప్ర‌క‌టించిన స‌మ‌యంలో కొంద‌రు ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదని, వారు కండువా కప్పుకున్నప్పుడు మీకే అర్థమవుతుందని రేవంత్ అన్నారు. టీఆర్ ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు. మరి కొందరు కూడా టీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉందన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబం విలాస జీవితం గడిపేందుకు సీఎం కేసీఆర్‌ వినియోగించుకున్నారని ఆరోపించారు. కాగా, రేవంత్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.