Begin typing your search above and press return to search.

ఇలాంటి ఎమ్మెల్యే దేశంలో ఎక్క‌డా ఉండ‌రు

By:  Tupaki Desk   |   24 July 2018 8:52 AM GMT
ఇలాంటి ఎమ్మెల్యే దేశంలో ఎక్క‌డా ఉండ‌రు
X
ప్ర‌స్తుత కాలంలో కూడా ఇలాంటి వారుంటారా...అని సందేహం క‌లిగించే వార్త ఇది. రాజ‌కీయాల్లో ఇంకా విలువలు, నైతిక‌త పాటించే మ‌నుషులు ఉన్నార‌ని భ‌రోసా క‌లిగించే సంద‌ర్భం ఇది. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం అంటే...అసోం రాష్ట్రంలోని జోర్హత్ జిల్లాలో గ‌ల‌ మరియాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి గురించి. అక్క‌డెక్క‌డో ఈశాన్య రాష్ట్రపు ఎమ్మెల్యే గురించి మ‌న‌కెందుకు అని మీరు అనుకుంటారేమో..కానీ ఆయ‌న చేసిన ప‌నికి ఖ‌చ్చితంగా మీరు ఆశ్చ‌ర్య‌పోతారు...ఇలా ఎంత‌మంది ఉంటారు అని ఆలోచిస్తారు కూడా!

ఇంత‌కీ ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి ఏం చేశారంటే...ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని ఓ ఎమ్మెల్యే…. ప్రజల మందు మోకాళ్లపై నిలబడి - చేతులు జోడించి క్షమాపణలు కోరారు. అసోం రాష్ట్రంలోని ఈ ఘటన జరిగింది. రూప్ జ్యోతి కుర్మి టీ ట్రైబ్ తెగకు చెందినవారు. ఇతని తండ్రి రూపమ్ కుర్మి అసోం మాజీ మంత్రి. తండ్రి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లో వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ది భిన్న‌మైన వ్య‌క్తిత్వం. నిత్యం ప్రజల్లో మమేకమయ్యే ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి గతంలో కూలీలకు సాయం చేస్తూ గన్నీ బ్యాగులు మోశారు. ఓ సందర్భంలో రైతులకు సాయంగా పొలం కూడా దున్నారు. అలా ప్ర‌జ‌ల్లో ప్ర‌జ‌ల్లో మ‌మేకం అయి ఉండే ఆయ‌న తాజాగా ఎన్నికల హామీలో భాగంగా మరియాని నియోజకవర్గంలోని నకచారి ఏరియాలోని మహాత్మాగాంధీ మోడల్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కమిటీకి అధ్యక్షుడిగానూ ఉన్న రూప్ జ్యోతి కుర్మి….హాస్పిటల్ కు వచ్చే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన వైద్యం అందటంలేదని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 8 మంది డాక్టర్లను హాస్పిటల్ లో నియమించారు. అయితే రూప్ జ్యోతి కుర్మి హాస్పిటల్ సందర్శనకు వెళ్లినప్పుడు వారిలో ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో వైద్య సేవలు అందక రోగులు పడుతున్న ఇబ్బందులను దగ్గరుండి చూసిన ఎమ్మెల్యే విషయాన్ని ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మకు కంప్లెయింట్ చేశారు.

అయితే ఎమ్మెల్యే ఫిర్యాదుతో మంత్రి సీరియ‌స్ అయ్యారు. ఫిర్యాదుకు స్పందించిన మంత్రి విధులకు గైర్హాజరైన డాక్టర్ల శాలరీలోని ఒకరోజు జీతాన్ని కట్ చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటికి కూడా డాక్టర్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో డాక్ట‌ర్ల త‌ప్పిదానికి ఎమ్మెల్యే ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ‌ డాక్ట‌ర్ల తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే హాస్పిటల్ లో పేషెంట్లకు సరైన వైద్య సదుపాయాలు అందించడంలో విఫలమైనందుకు పేషెంట్ల ఎదుట మోకాళ్లపై నిల్చుని, చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు.