Begin typing your search above and press return to search.

పవన్ మీద కత్తి దూసిన ఎర్రన్న... ?

By:  Tupaki Desk   |   1 Nov 2021 1:30 PM GMT
పవన్ మీద కత్తి దూసిన ఎర్రన్న... ?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ రాక రాక విశాఖ వచ్చారు. నీ రాక కోసం అంటూ ఉక్కు కార్మిక లోకం ఆశగా ఎదురుచూసింది. అలాంటిది పవన్ కళ్యాణ్ వచ్చి ఉక్కు కార్మికుల పోరాటానికి  మద్దతు ఇచ్చారు కానీ కేంద్రాన్ని మోడీని పల్లెత్తు మాట అనకపోవడంతో కార్మిక లోకం గుస్సా అవుతోంది. దీని మీద సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అయితే ఒక రేంజిలో పవన్ మీద విమర్శలు చేశారు. పవన్ జరిపింది మీటింగ్ కాదు ఒక ఈవెంట్ లాగ సాగింది అంటూ సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్త శుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పవన్ గాజువాకలో ఓడిపోవడానికి సంబంధం ఏంటి అని ఆయన నిలదీశారు. ప్రైవేటీకరణ వంటి సీరియస్ ఇష్యూ మీద మాట్లాడుతున్నపుడు మధ్యలో ఇలాంటి విషయాల ప్రస్థావన ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం మంచిదే కానీ కేంద్రం చేతిలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉందన్న సంగతి ఆయనకు తెలియదా అంటూ కౌంటర్లేశారు.

కేంద్రంలో ఉన్న బీజేపీకి పొత్తు ఉండడం వల్లనే పవన్ వారిని వదిలేశారా అన్న చర్చ కూడా వస్తోందని అన్నారు. అఖిల పక్షం మీటింగ్ నిర్వహించమని ఉక్కు కర్మాగారం పరిరక్షణ కమిటీ ఎన్నో సార్లు కోరిందని ఆయన గుర్తు చేశారు. తాము అడిగితే ప్రభుత్వం వినదు కదా రాజకీయ నాయకత్వం కూడా కలసి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి చూసుకుంటే పవన్ మాట్లాడిన దాని మీద ఉక్కు కార్మికులు ఏవరూ సంతోషంగా లేరన్న‌దే ఎర్రన్న మాటగా ఉంది.

నిజానికి  కేంద్రాన్ని నిలదీద్దాం, అందరం కలసి ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణను అడ్డుకుందామని పవన్ పిలుపు ఇస్తారని ఉక్కు కార్మికులు ఆశించారుట. మరి పవన్ మాత్రం వైసీపీ మీద విమర్శలు చేసి వెళ్ళిపోవడంతో వారంతా మధనపడుతున్నారు. మొత్తానికి ఒకనాటి మిత్రులు వామపక్షాలు ఇపుడు పవన్ వైఖరి మీద కత్తులు దూయడానికి రెండు కారణాలు ఉన్నాయన్న విశ్లేషణ ఉంది. వారికి బీజేపీ బద్ధ శత్రువు. దాంతో పవన్ అంటకాగుతూ ఉండడం ఒక మంట అయితే ఉక్కు విషయంలో తాను గట్టిగా నిలబడతానని చెప్పకపోవడం మరో మంటట. సో ఎర్రన్నలు  జనసేనాని మీద గట్టిగా మాట్లాడుతున్నారు. దీనికి అటు వైపు నుంచి ఎలాంటి  రియాక్షన్ వస్తుందో చూడాలి.