Begin typing your search above and press return to search.

వేడిపెంచుతున్న పొంగులేటి, జూప‌ల్లి.. ఈట‌ల‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లు.. బీజేపీలోకేనా?

By:  Tupaki Desk   |   25 May 2023 10:00 PM GMT
వేడిపెంచుతున్న పొంగులేటి, జూప‌ల్లి.. ఈట‌ల‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లు.. బీజేపీలోకేనా?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన ఖ‌మ్మం మాజీ ఎంపీ.. అధికార బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఇట‌వ‌ల స‌స్పెన్ష‌న్‌కు గురైన‌.. పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి.. మ‌ళ్లీ పొలిటిక‌ల్ కాక పెంచారు. ఒక వైపు అధికార పార్టీ నేత‌ల‌పైనా.. సీఎం కేసీఆర్‌పైనా ఆయ‌న దూకుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు.. ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంపై చ‌ర్చల్లో మునిగిపోయారు. దీంతో ఒక్కసారిగా రాజ‌కీయం వేడెక్కింది.

కాంగ్రెస్‌లోకి రావాల‌ని.. ఒక‌వైపు రేవంత్‌రెడ్డి ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. దీనిపై పొంగులేటి స్పందించ‌కుండా మౌనం వ‌హించారు. మ‌రోవైపు.. తాజాగా బీజేపీ నాయ‌కుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌తో ఆయ‌న భేటీ కావ‌డంతో రాజ‌కీయంగా పొంగులేటి తీసుకునే నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అస‌లు ఆయ‌న ఎటు వైపు వెళ్తారు..? ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇదిలావుం టే.. తాజాగా పొంగులేటి స‌హా జూప‌ల్లి కృష్ణారావుల‌తో ఈట‌ల భేటీ కావ‌డం.. రాజ‌కీయంగా అంచ‌నాలు పెంచుతోంది.

హైద‌రాబాద్‌ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో దాదాపు నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. గన్‌మె న్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం బీజేపీ చేరిక‌ల క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌.. కీల‌క‌నేత‌ల‌ను పార్టీలో చేర్పించేందుకు చ‌ర్య‌లు తీసు కుంటున్నారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా పొంగులేటి, జూప‌ల్లి(ఈయ‌న కూడా బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది)తో భేటీ కావ‌డం.. రాజ‌కీయంగా వీరు బీజేపీవైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివ‌రిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు, వ‌చ్చే ఏడాది ప్రారంభంలో సార్వ‌త్రిక ఎన్నికలు ఉన్న నేప థ్యంలో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కులుగా ఉన్న జూప‌ల్లి, పొంగులేటిల‌ను పార్టీలోకి తీసుకునేందుకు.. బీజేపీ ప్ర‌య‌త్నించే అవ‌కాశం మెండుగా ఉంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో తాజా భేటీకి ప్రాధాన్యం సంత‌రించుకుంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. గ‌త కొన్నాళ్లుగా అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతోపాటు.. ఖ‌మ్మం బీఆర్ ఎస్‌ నేత‌ల‌కు పొంగులేటి కంటిపై కునుకులేకుండా చేస్తున్నారనే చ‌ర్చ సాగుతోంది. దీంతో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న పొంగులేటిని త‌మ వైపు తిప్పుకొంటే.. ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.