Begin typing your search above and press return to search.

కంటైనర్ ఢీ కొట్టి లేడీ సింగం దర్మరణం

By:  Tupaki Desk   |   17 May 2023 8:48 AM GMT
కంటైనర్ ఢీ కొట్టి లేడీ సింగం దర్మరణం
X
అసోం పోలీసు విభాగంలో లేడీ సింగంగా పేరున్న మహిళా పోలీసు అధికారి జున్ మోనీ రాభా తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న ప్రైవేటు కారును ఒక కంటైనర్ ఢీ కొనటంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లుగా చెబుతున్నారు.

అసోం పోలీసు విభాగానికి చెందిన రాభా.. నాగాన్ జిల్లాలో ఎస్ఐ(సబ్ ఇన్ స్పెక్టర్)గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో విధుల్లో ఆమె కఠినంగా వ్యవహరించేవారు. దీంతో.. ఆమె పని తీరుతో లేడీ సింగంగా గుర్తింపు పొందారు.

దబాంగ్ లేడీగా పేరున్న ఆమె.. చాలా తక్కువ వ్యవధిలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే.. ఆ తర్వాత ఆమె పలు వివాదాల్లోచిక్కుకున్నారు. చివరకు అవినీతి ఆరోపణలపై ఆమె గత జూన్ లో అరెస్టుఅయ్యారు. కొంతకాలం సస్పెన్షన్ లో ఉన్న ఆమె దాన్ని ఎత్తేయించుకోవటంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆమె సోమవారం అర్థరాత్రి 2.30 గంటల వేళలో సివిల్ దుస్తుల్లో.. తన ప్రైవేటు వాహనంలో వెళుతున్నారు. జాఖలాబంధా స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామంలో ఆమె కారును ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఒక కంటైనర్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే దగ్గర్లోని పోలీసులు అక్కడకు వెళ్లారు. కారులో ఉన్న లేడీ సింగాన్ని గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అప్పటికే ఆమె ప్రాణాల్ని విడిచినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. అంత అర్థరాత్రి వేళ ఒంటరిగా ఆమె ఎక్కడకు వెళుతున్నారన్న విషయం తమకు తెలీదని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. ఏమైనా.. లేడీ సింగం ఇక లేరు. అయితే.. ఆమె మరణం ఒక మిస్టరీగా మారిందన్న మాట వినిపిస్తోంది.