Begin typing your search above and press return to search.

టీడీపీ మాజీ మంత్రి వైసీపీలోకి..

By:  Tupaki Desk   |   7 March 2017 7:39 AM GMT
టీడీపీ మాజీ మంత్రి వైసీపీలోకి..
X
మాజీ మంత్రి - టీడీపీ నేత జేఆర్ పుష్పరాజ్ వైసీపీలో చేరనున్నారా..? టీడీపీని వీడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి గుంటూరు టీడీపీ వర్గాలు. చంద్రబాబు పదేపదే అన్యాయం చేస్తుండడంతో ఇక ఆయన బుజ్జగించినా పార్టీలో ఉండకూడదని.. ఉంటే తన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడడం ఖాయమని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన పుష్పరాజ్ కు అనంతర కాలంలో పార్టీ టిక్కెట్ దొరకలేదు. ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించి చంద్రబాబును కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరినా హామీ దొరికిందే కానీ చివరి నిమిషంలో అన్యాయమే మిగిలింది. ఇప్పుడాయన మరో మెట్టు దిగి ఎమ్మెల్సీ సీటు ఇచ్చినా చాలన్నారు. కానీ... మళ్లీ ఈసారి కూడా చంద్రబాబు ఊరించి ఉసూరుమనిపించారు. దీంతో పుష్ఫరాజ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

నిజానికి రాజ్యసభ సీటు విషయంలో హ్యాండిచ్చినప్పుడే పుష్ఫరాజ్ ఆవేదనకు గురయ్యారు. తనను కాదని.. కాంగ్రెస్ నుంచి వచ్చిన టీజీ వెంకటేశ్ కు రాజ్యసభ టిక్కెటివ్వడంతో ఆయన ఆవేదన చెందారు. అంతేకాదు.. టీజీ వెంకటేశ్ పార్టీకి డబ్బిచ్చి సీటు కొనుకున్నారని.. తాను డబ్బు ఇవ్వకపోవడం వల్ల సీటు రాలేదని ఆయన అప్పట్లో ఆరోపించారు కూడా. దాంతో అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో అప్పటికి శాంతించారు. ఆ సమయంలోనే చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ పై హామీ ఇచ్చారట.

అయితే.. ఈసారి కూడా గతంలో జరిగినట్లే అన్యాయం జరిగిందన్నది పుష్ఫరాజ్ ఆరోపణ. కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడంతో పుష్పరాజ్ మండిపడతున్నారు. దీంతో పుష్కరాజ్ టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన అనుచరులు కూడా ఇంకా ఎన్నిసార్లు మోసపోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే పుష్కరాజ్‌ ను బుజ్జగించేందుకు కొందరు టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్టు సమాచారం. కానీ పుష్పరాజ్ మాత్రం పదేపదే మోసపోవడానికి తాను సిద్ధంగా లేనని.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో క్లారిటీ ఇస్తానని చెబుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/