Begin typing your search above and press return to search.

భ‌విష్య‌వాణిని చెప్పేసిన జోగిని స్వ‌ర్ణ‌ల‌త‌!

By:  Tupaki Desk   |   22 July 2019 6:55 AM GMT
భ‌విష్య‌వాణిని చెప్పేసిన జోగిని స్వ‌ర్ణ‌ల‌త‌!
X
ఆదివారం అంగ‌రంగ వైభ‌వంగా సాగిన ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల ఉత్స‌వంలో కీల‌క‌మైన జోగిని స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య వాణిని తాజాగా వినిపించారు. బోనాల సంద‌ర్భంగా భ‌విష్య‌వాణిని వినిపించే సంప్ర‌దాయం ఎప్ప‌టినుంచో వ‌స్తున్న‌దే. ఈ రోజు (సోమ‌వారం) ఉద‌యం నిర్వ‌హించిన రంగం కార్య‌క్ర‌మంలో స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య వాణిని వినిపించారు.

గ‌త ఏడాది రంగంలో భ‌విష్య‌వాణిని చెప్పే క్ర‌మంలో తీవ్ర అసంతృప్తిని.. ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన దానికి భిన్నంగా ఈసారి మాత్రం సానుకూలంగా స్పందించ‌టం గ‌మ‌నార్హం. ప‌చ్చి కుండ‌పై నిల‌బ‌డి భ‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన ఆమె.. ఈ ఏడాది వ‌ర్షాలు బాగా ప‌డ‌తాయ‌ని చెప్పారు.

ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని.. గంగాదేవికి జ‌లాభిషేకం చేయాల‌ని.. త‌ప్ప‌కుండా కోర్కెలు తీర‌తాయ‌న్నారు. త‌న‌కు త‌ప్ప‌కుండా బోనం స‌మ‌ర్పించాల‌ని స్వ‌ర్ణ‌ల‌త ఆదేశించారు. భ‌క్తులు స‌మ‌ర్పించిన ముడుపుల్ని తాను సంతోషంగా అందుకున్న‌ట్లు చెప్పారు.

నా బిడ్డ‌ల్ని సంతోషంగా ఉంచే బాధ్య‌త నాదే. నాకు పూజ‌లెందుకు ఆపుతున్నారు. బోనం మాత్రం త‌ప్ప‌కుండా స‌మ‌ర్పించాలి. ప్ర‌జ‌లంద‌రినీ సంతోషంగా చూస్తాన‌ని మాటిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఇదే తీరులో గ‌త సంవ‌త్స‌రం ఏర్పాటు చేసిన భ‌విష్య‌వాణి కార్య‌క్ర‌మంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారు సంతోషంతో కాకుండా దుంఖంతో వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌మ‌ర్పించిన బంగారు బోనం కొంత సంతోషం.. కొంత దుంఖం క‌లిగించింద‌న్న ఆమె.. బంగారు బోనంతో ఆనంద‌ప‌ర్చ‌డ‌మ‌నేది మూర్ఖ‌త్వ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

గ‌త ఏడాది మ‌హిళ‌లు వేద‌న‌తో ఉన్న‌ట్లుగా పేర్కొన్న భ‌విష్య‌వాణి.. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా సంతోషంగా ఉన్న‌ట్లుగా చెప్పారు. మొత్తంగా ఈసారి భ‌విష్య‌వాణి సానుకూలంగా రావ‌టంపై నిర్వాహ‌కులు ఊపిరిపీల్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు.