Begin typing your search above and press return to search.

దున్నపోతుని తన్నినట్లు.. జితేందర్‌రెడ్డి ట్వీట్‌ వైరల్!

By:  Tupaki Desk   |   29 Jun 2023 1:09 PM GMT
దున్నపోతుని తన్నినట్లు.. జితేందర్‌రెడ్డి ట్వీట్‌ వైరల్!
X
కర్నాటక ఎన్నికల ఫలితాల ముందువరకూ ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపించిన తెలంగాణ బీజేపీ... ఆ ఎన్నికల ఫలితాల అనంతరం డీలా పడిపోయినట్లు కనిపించడం మొదలుపెట్టింది. దీనికితోడు చేరికలు కూడా ఆగిపోవడంతో శ్రేణుల్లో ఉత్సాహం తగ్గినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈటల వర్సెస్ బండి అనే చర్చ సైతం తెరపైకి రావడంతో పార్టీలో మరింత కలకలం నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో జితేందర్‌ రెడ్డి ఒక ట్వీట్ చేశారు!

ఇతర పార్టీలపైనా, ప్రత్యర్ధిపార్టీ నేతలపైనా ఆన్ లైన్ వేదికగా నాయకులు సెటైర్స్ వేసుకోవడం సహజం. అయితే రొటీన్ కి భిన్నంగా తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఒక భారీ సెటైర్ వేశారు.

ఇందులో భాగంగా... దున్నపోతుల్ని తన్నుతూ ఓ వ్యక్తి వాటిని ట్రాలీ ఎక్కిస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. దానికింద ఒక కామెంట్ పెట్టారు. ఇది ఇప్పుడు బీజేపీలో హాట్ చర్చకు తెరలేపింది.

అవును... దున్నపోతుల్ని తన్నుతూ ఓ వ్యక్తి ట్రాలీ ఎక్కిస్తున్న వీడియోను పోస్ట్‌ చేసిన.. జితేందర్ రెడ్డి... "ఇలాంటి ట్రీట్ మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అవసరం" అంటూ క్యాప్షన్‌ ఉంచారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ... వెంటనే దాన్ని డిలీట్ చేసేశారు. మళ్లీ ఏమైందో ఏమో మళ్లీ పోస్ట్ చేశారు.

దీంతో జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారా.. లేక, పార్టీ మారబోతున్నారా.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటా.. లేక, కారెక్కబోతున్నారా అంటూ ఆన్ లైన్ వేదికగా కొత్త కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పుని జితేందర్ కోరుకుంటున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది!

మరి అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలను ట్యాగ్‌ చేసిన ఈ ట్వీట్ బీజేపీలో ఎలాంటి చర్చకు తెరలేపనుందనేది వేచి చూడాలి. ఆ వీడియోలో దున్నపోతుని తన్నినట్లు... ఎవరు ఎవరిని తన్నాలని జితేందర్ కోరుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది!