Begin typing your search above and press return to search.

జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు మోడీ పరువు తీశారు

By:  Tupaki Desk   |   30 Jun 2016 12:18 PM GMT
జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు మోడీ పరువు తీశారు
X
‘బేటీ బచావో- బేటీ పడావో’.. ఈ నినాదం మోడీ ప్రభుత్వ విజన్ లో అత్యంత కీలకమైనది. మోడీ స్వయంగా దీనికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆడపిల్లలను చదివించాలని - రక్షించాలని.. వారికి చిన్నవయసులో పెళ్లి చేయరాదని.. ఇలా ఎన్నో లక్ష్యాలు ఇమిడి ఉన్న ఈ నినాదాన్ని దేశమంతా ప్రచారం చేస్తున్నారు. కానీ.. బీజేపీ నేతలే దీనికి తూట్లు పొడుస్తున్నారు. చిన్నాచితకా నేతలు కాదు.. ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే మోడీ నినాదానికి భిన్నంగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొంటున్నారు.. అంతేకాదు, మోడీ పరువు కూడా తీశారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు తాళా మరండి తన కుమారుడికి 11 ఏళ్ల బాలికతో వివాహం చేశారు. బాల్యా వివాహాలపై స్థానిక శిశుసంక్షేమ శాఖ అధికారి విచారణలో ఈ విషయం వెల్లడి కావడం సంచలనం సృష్టించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాలా మరండి కుమారుడి వివాహం ఈ నెల 28న జరిగింది. పాఠశాల రికార్డుల ప్రకారం మరండి కోడలు రితు బస్కి 2005 జులై 25న జన్మించింది. దీనిని బట్టి ఆమె వయస్సు 11 సంవత్సరాలు. బీజేజీ అధ్యక్షుడు తన కుమారుడికి మైనర్ బాలికతో వివాహం జరిపించడం ఇప్పుడు పెను దుమారమే రేపుతోంది.

మరాండీ చేసిన పని కేవలం జార్ఖండ్లోనే కాదు కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న బీజేపీని ఇబ్బందుల్లో నెట్టేసింది. మంగళవారం ఆయన తన కుమారుడు మున్నా మరాండీకి రితూ బక్షీ అనే అమ్మాయితో పెళ్లి చేశారు. అయితే.. ఆయన వ్యతిరేకులు దీనిపై విమర్శలు కురిపించారు. ఆ నవ వధువుకు పెళ్లి వయసు రాలేదని సందేహాలు వ్యక్తంచేశారు. దీనిపై ఆరోపనలు తీవ్రమవడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. వారి విచారణలో అసలు విషయం బయటపడింది. జార్ఖండ్ లోని బీజేపీయేతర పార్టీలే కాకుండా బీజేపీలోని ఆయన వ్యతిరేకులు కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. విషయం ఇప్పటికే కేంద్రానికి చేరిందని తెలుస్తోంది.

బీజేపీ అధిష్ఠానం తాళా మరాండీ వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసకుని బేటీ బచావో, బేటీ పడావో అంటూ గ్రామ సీమల నుంచి ప్రచారం ప్రారంభించగా పార్టీలో కీలక నేతలే ఇలాంటి పనులు చేస్తూ విపక్షాలకు విమర్శించే అవకాశం కల్పిస్తున్నారని బీజేపీ నేతలే అంటున్నారు. మరి, ఈ విషయంపై పార్టీ ఏం తేలుస్తుందో చూడాలి.