Begin typing your search above and press return to search.

జగన్‌ పర్యటన వేళ.. జేసీ కలకలం!

By:  Tupaki Desk   |   26 April 2023 3:34 PM GMT
జగన్‌ పర్యటన వేళ.. జేసీ కలకలం!
X
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి దూకుడు పెంచారు. అనంతపురం జిల్లా రాజకీయాలను దశాబ్దాల తరబడి శాసించిన జేసీ బ్రదర్స్‌ కు 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక తీవ్ర ఇబ్బందులు వచ్చిపడ్డాయి. దివాకర్‌ ట్రావెల్స్‌ వ్యవహారంలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పోలీసులు జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయన బెయిల్‌ పై ఉన్నారు.

కాగా 2019 ఎన్నికల్లో జేసీ దివాకర్‌ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌ రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో జేసీ బ్రదర్స్‌ రాజకీయంగా క్రియాశీలమయ్యారు.

ఇప్పటికే జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్‌ గా నిత్యం దూకుడైన రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు జేసీ దివాకర్‌ రెడ్డి వంతు వచ్చింది. ఈయన సైతం తాజాగా తెలంగాణలో రాయలసీమను కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా తాజాగా అనంతపురం జిల్లా శింగనమలలో పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ నివాసానికి వెళ్లారు. దళిత సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాథ్‌ 2004, 2009ల్లో అనంతపురం జిల్లా శింగనమల నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌ గా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయాక పీసీసీ ప్రెసిడెంట్‌ గా విధులు నిర్వర్తించారు.

ఈ నేపథ్యంలో ఆయనను టీడీపీలోకి ఆహ్వానించడానికి జేసీ దివాకర్‌ రెడ్డి శింగనమల వెళ్లారు. ఓవైపు సీఎం జగన్‌.. జగనన్న వసతి దీవెన నగదు జమ చేయడానికి శింగనమల నియోజకవర్గంలోనే ఉన్నారు. ఇదే సమయంలో జేసీ దివాకర్‌ రెడ్డి.. సాకే శైలజానాథ్‌ నివాసానికి వెళ్లి ఆయనను టీడీపీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం శింగనమల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా బండారు శ్రావణి శ్రీ ఉన్నారు. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం ఐదుగురుతో నియోజకవర్గ కమిటీ వేసింది.

ఈ నేపథ్యంలో సాకే శైలజనాథ్‌ టీడీపీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో శింగనమల సీటును ఆయనకు కట్టబెడతారని తెలుస్తోంది. మరోవైపు తనను పీసీసీ అధ్యక్షుడిగా తప్పించి ఆ పదవిని గిడుగు రుద్రరాజుకు కట్టబెట్టడంతో సాకే శైలజానాథ్‌ కూడా ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జేసీ దివాకర్‌ రెడ్డి.. సాకేను కలిసి టీడీపీలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది.