Begin typing your search above and press return to search.

పాలిటిక్స్‌ కు జేసీ సోద‌రులు గుడ్ బై

By:  Tupaki Desk   |   1 Jan 2016 3:23 PM GMT
పాలిటిక్స్‌ కు జేసీ సోద‌రులు గుడ్ బై
X
అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాలుగా వెలుగొందుతున్న జేసీ దివాక‌ర్‌ రెడ్డి పేరు తెలియ‌ని వారుండ‌రు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు కాంగ్రెస్‌ లో ఉన్న జేసీ - ఆయ‌న సోద‌రుడు ప్ర‌భాక‌ర్‌ రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సైకిలెక్కారు. అన్న జేసీ దివాక‌ర్‌ రెడ్డి ఎంపీగాను - త‌మ్ముడు ప్ర‌భాక‌ర్‌ రెడ్డి ఎమ్మెల్యేగాను విజ‌యం సాధించారు. అయితే ఈ సోద‌రులిద్ద‌రు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయాల నుంచి పూర్తిగా త‌ప్పుకోనున్నార‌నే వార్త‌లు ఇప్పుడు అనంతపురం జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ కుమారుల‌ను గ్రాండ్‌ గా పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించేందుకు జేసీ సోద‌రులు ఇప్ప‌టి నుంచే ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రభుత్వ అభివృద్ధి పనులతోపాటు తమ సొంత ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో కూడా జేసీ సోద‌రుల వార‌సులు బిజీ బిజీ అవుతున్నారు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వీరు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజా రాజ‌కీయాల్లో ఇమ‌డ లేక ప్ర‌తి రోజు ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు చేస్తున్న జేసీ దివాక‌ర్‌ రెడ్డి తన వారసుడిగా జేసీ పవన్‌ రెడ్డిని తెరపైకి తెస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ అనంతపురం లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. రంజాన్ సంద‌ర్భంగా పేద ముస్లింల‌కు పండ‌గ‌కు కావాల్సిన స‌రుకులు పంపిణీ చేసిన ప‌వ‌న్‌ రెడ్డి.... యువతను ఆకట్టుకునే విధంగా ఒలింపిక్ రన్‌ అనంతపురంలో ఏర్పాటుచేసి అజారుద్దీన్, సినీతార రెజినా తదితర సెలబ్రిటీలను పిలిపించి నానా హంగామా చేశారు. క్రిస్మస్‌ ని పురస్కరించుకుని అన్ని చర్చిలలో ప్రార్థనలను నిర్వహించి కేక్‌ లను పంచిపెట్టారు. ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీతోనే ఈ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ రెడ్డి అనంత‌పురం ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగే సూచ‌న‌లు ఉన్నాయి.

ఇక జేసీ సోద‌రుల‌కు కంచుకోట అయిన తాడిప‌త్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టారు. ప్రభాకర్‌ రెడ్డి వెంట ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అక్క‌డ గ‌త రెండు ద‌శాబ్దాల్లో తాము చేప‌ట్టిన అభివ‌ద్ధి ప‌నుల‌తో పాటు నగరప్రజల నుంచి మంచి మార్కులు పొందడం కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జేసీ సోద‌రుల వార‌సులిద్ద‌రు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.