Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై ధ్వజమెత్తిన జేపీ

By:  Tupaki Desk   |   9 Jun 2015 8:22 AM GMT
చంద్రబాబుపై ధ్వజమెత్తిన జేపీ
X
ఓటుకు నోటు కేసు విషయంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ స్పందించారు. ఈ కేసు విషయంలో చంద్రబాబు తీరుపై ఆయన ధ్వజమెత్తారు. సోమవారం మహా సంకల్ప దీక్షలో చంద్రబాబు మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. రాజకీయ సమస్యను ప్రజల సమస్యగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని.. జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

''చంద్రబాబు బాధను తెలుగు ప్రజల బాధగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. నిన్నటి చంద్రబాబు ప్రసంగం ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ దివాళా తీస్తుంటే నాయకులు మాత్రం కుబేరులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులే లేవంటున్న నాయకులకు ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది. చంద్రబాబు ఏమైనా అంటే మహాత్ముడికి వారసుడినని.. నీతివంతమైన రాజకీయాలు చేస్తానని.. అన్నాహజారేకు వారసుడినని చెప్పుకుంటారు? కానీ ఇలాంటి పనులు ఎలా చేస్తారు? ఒకప్పుడు ఎన్టీఆర్‌ పైసా ఖర్చు పెట్టకుండా నాయకుల్ని రాజ్యసభకు పంపించారు.

చంద్రబాబు ముందు ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతో కాదో స్పష్టం చేయాలి. ఈ వ్యవహారంలో ఆయన ఎందుకు బుకాయిస్తున్నారు? రేవంత్‌ను ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు? మీ అనుమతి లేకుండా రేవంత్‌ ఆ పని చేసి ఉంటే తక్షణం ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించండి. అలా చేయకుండా ఎందుకు బుకాయిస్తున్నారు? రాజకీయ వ్యవహారాన్ని ప్రజల సమస్యగా ఎందుకు మారుస్తున్నారు? 2014లో ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేకే చంద్రబాబుకు ఓటేశారు. జగన్‌ను చూసి జనం భయపడ్డారు. అంతే తప్ప చంద్రబాబు నీతిమంతుడని కాదు'' అని జేపీ అన్నారు.