Begin typing your search above and press return to search.

కరోనా తెచ్చిన తంటా.. నవ్వడంలో శిక్షణకు జపాన్‌ వాసులు

By:  Tupaki Desk   |   17 May 2023 5:00 AM GMT
కరోనా తెచ్చిన తంటా.. నవ్వడంలో శిక్షణకు జపాన్‌ వాసులు
X
జపాన్‌ వాసులు ఇప్పుడు నవ్వడంలో శిక్షణ వెళుతున్నారు. ఏంటీ.. నవ్వడంలో శిక్షణ ఏమిటనీ ఆశ్చర్యంగా ఉందా.. అదే మరీ కరోనా తెచ్చిన తంటా. మాస్కులతో నోళ్లు మూసుకుని సుదీర్ఘకాలం పాటు ఉండడం చేత పెదాలు నవ్వేందుకు అంగీకరించడం లేదట. ఎలా నవ్వాలో కూడా వాళ్లు మరిచిపోయారట. ఇలాంటి వారి సంఖ్య ఎక్కువ కావడంతో జపాన్‌ లో నవ్వడంలో శిక్షణ ఇచ్చే ఇనిస్టిట్యూట్లను ప్రారంభించారు.

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దీని బారి నుండి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కోవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు ప్రజలపై విధించిన ఆంక్షలు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. జపాన్‌ లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సుదీర్ఘకాలం పాటు జపాన్‌ వాసులు మాస్కులు ధరించడం వల్ల వాళ్లు నవ్వడమే మరిచిపోయారట. మూడు సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత జపాన్‌ ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. మాస్కులు ధరించడం ప్రజల వ్యక్తిగతమని ప్రకటించింది. కానీ జపాన్‌ ప్రజల మోముల్లో చిరునవ్వు మాత్రం కనిపించడం లేదు.

ఇప్పుడు జపాన్‌ లో నవ్వడం కోసం వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తున్నారట. ప్రత్యేక శిక్షణ కేంద్రాలను నడుపుతున్నారట. చేతిలో అద్దం పెట్టుకుని నవ్వు కోసం ఎదురుచూస్తున్నారట అక్కడి ప్రజలు. ఆంక్షల సమయంలో సన్నిహితులను కలవడం కుదరకపోవడంతో నవ్వును పంచుకునే అవకాశం లేకుండా పోయిందని సెమినార్‌ లో పలువురు వాపోతున్నారు. సుదీర్ఘకాలం మాస్కులు వాడడం వల్ల స్నేహితుల మొఖమే మరిచిపోయామని వారు అంటున్నారు.

అయితే కోవిడ్‌కు ముందు కూడా టోక్యోలో స్మయిల్‌ శిక్షణ తరగతులు ఉండేవని నిర్వహకులు చెబుతున్నారు. అయితే ఆంక్షలు సడలించాక ఈ కోచింగ్‌ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య మాత్రం 5 రెట్లు పెరిగిందని వారంటున్నారు. ఏదేమైనా జపాన్‌ లో కోవిడ్‌ ఆంక్షలు సడలించినా అక్కడి ప్రజల మోములు వికసించడానికి ఇంకా చాలా సమయమే పట్టేట్టుంది.