Begin typing your search above and press return to search.

జనసేన ఉమెన్‌ వింగ్‌..పాతికేళ్ళ అమ్మాయికి ఛైర్మన్ పదవి

By:  Tupaki Desk   |   1 Feb 2019 5:08 PM GMT
జనసేన ఉమెన్‌ వింగ్‌..పాతికేళ్ళ అమ్మాయికి ఛైర్మన్ పదవి
X
రాజకీయాల్లో మార్పు కోసం - ప్రశ్నించడం కోసం అంటూ పార్టీని ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టిన అయిదు సంవత్సరాలకు పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టారు. గత ఎన్నికల సమయంలో పార్టీ నిర్మాణం జరగలేదు - కనీసం సభ్యత్వ నమోదు కూడా లేదు. గత ఎన్నికల్లో పార్టీ బలోపేతం గురించి ఆలోచించకుండా రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి - కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌ త్వరలో జరుగబోతున్న ఎన్నికల్లో మాత్రం కింగ్‌ అవ్వాలని లేదంటే కనీసం కింగ్‌ మేకర్‌ అవ్వాలనే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం పార్టీని బలోపేతం చేస్తున్నారు. వేరే పార్టీల నుండి వచ్చే వారిని చేర్చుకోవడంతో పాటు అన్ని విభాగాలను ఏర్పాటు చేస్తూ పార్టీ బలోపేతం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మొదటి నుండి కూడా యువతకు ప్రాముఖ్యత ఇస్తానంటూ వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఉమెన్‌ వింగ్‌ ఏర్పాటులో యువతకు ప్రాముఖ్యత ఇచ్చారు. అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో మూడు పదుల వయసు దాటని అమ్మాయిలు చాలా అరుదుగా చూస్తాం. అయితే జనసేన పార్టీ మహిళ విభాగంలో అమ్మాయిలకు జనసేనాని ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చాడు. పార్టీ బలోపేతం కోసం 22 కమిటీలను ఏర్పాటు చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఆ కమిటీల్లో మహిళలకు స్థానం కల్పించాడు. కమిటీల్లో స్థానం పొందిన ప్రతి ఒక్క మహిళ గురించి పవన్‌ కళ్యాణ్‌ క్షుణ్ణంగా తెలుసుకుని - వారి గురించి - వారి రాజకీయ అనుభవం గురించి అన్ని విషయాలను కులంకశంగా పరిగణలోకి తీసుకుని వారిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపిక అయిన వారిలో ఎక్కువగా విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు గృహిణులు కూడా ఉన్నారు.

ఇక పార్టీ మహిళ విభాగం చైర్మన్‌ గా కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏళ్ల జవ్వాజి రేఖను నియమించడం జరిగింది. సీఎ చదివిన రేఖ ప్రస్తుతం ఆడిటర్‌ గా ఉద్యోగం చేస్తోంది. ఇక వైస్‌ చైర్మన్‌ లుగా 25 ఏళ్ల సింధూరి కవిత, 28 ఏళ్ల షేక్‌ జరీనా, 30 ఏళ్ల నూతాటి ప్రియ సౌజన్య, 47 ఏళ్ల శ్రీవాణిలను ఎంపిక చేయడం జరిగింది. మహిళ విభాగం ఎంపిక విషయంలో పలు విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులను కూడా పవన్‌ ఎంపిక చేశారు. యువ శక్తిని ఉపయోగించుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ ఈ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. యువతలోని బలంను పూర్తిగా వినియోగించుకోవాలని జనసేనాని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా యువతకు ప్రాముఖ్యత ఇవ్వాలని పవన్‌ భావిస్తున్నాడు.