Begin typing your search above and press return to search.

యాభై సీట్లు... పవన్ సీఎం ...కీలక అడుగు దిశగా...?

By:  Tupaki Desk   |   14 April 2023 12:24 PM GMT
యాభై సీట్లు... పవన్ సీఎం ...కీలక అడుగు దిశగా...?
X
ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు పొత్తుల కధ తేలితేనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధం రోడ్ల మీదకు వస్తుంది. ఏపీలో ఎన్నికలకు కచ్చితంగా ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. ప్రస్తుతానికి పవన్ బీజేపీతో మైత్రీ బంధంలో ఉన్నారు. అయితే క్రిష్ణ రాయబారం మాదిరిగా చివరి మాట చెప్పడానికో లేక బీజేపీ మదిలో ఉన్న దాన్ని కనుగొనడానికో ఢిల్లీ పర్యటన ఈ మధ్య పవన్ చేసి వచ్చారు.

నిజానికి పవన్ కి చేతినిండా సినిమాలు క్షణం కూడా ఊపిరాడని పనులు ఉన్నాయి. అయినా సరే ఆయన పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశారు అంటే ఏదో ఒకటి తేల్చుకోవడానికే అని అంతా ఊహించారు. ఏపీలో 2014 పొత్తులను రిపీట్ చేయాలన్న ఉద్దశ్యంతో పవన్ ఢిల్లీకి వెళ్ళారని అంటున్నారు.

అయితే అక్కడ ఏమి జరిగింది అన్నది తెలియరావడంలేదు కానీ కట్ చేస్తే ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు కధలో కీలక అడుగులు పడ్డాయని అంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశం అయినట్టు టాక్.. తెలుగుదేశం జనసేన నాయకులు కూర్చుని పొత్తుల విషయంలో చర్చలు జరిపారని అంటున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ జనార్ధన్ చర్చలకు రాగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, మరి కొందరు నాయకులు చర్చలకు కూర్చున్నారని ప్రచారం సాగుతోంది.

ఇక ఈ భేటీలో తేల్చినది ఏంటి అంటే జనసేన తమ ప్రతిపాదనలను టీడీపీ నేతలకు అందించింది అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు నలభై నుంచి యాభై సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాలని, కనీసం రెండేళ్ళకు తక్కువ కాకుండా సీఎం పదవిని అధికార వాటాలో భాగంగా ఇవ్వాలని ఇంక ఎంపీ సీట్ల విషయంలో 5కు అటు ఇటుగా ఇచ్చిన పరవాలేదని డిమాండ్లు పెడుతూ తమ అభిప్రాయాన్ని జనసేన చెప్పిందని అంటున్నారు.

అంతే కాదు తాము కోరుకున్న చోట్ల, తమకు బలంగా ఉన్న చోట్ల మాత్రమే సీట్లు ఇవ్వాలని కూడా జనసేన కండిషన్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలలో జనసేనకు బలం బాగా ఉందని అంటున్న నేపధ్యంలో అక్కడ అధిక సీట్లు కావాలని కోరినట్లుగా అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో తీసుకుంటే ముప్పయి నాలుగు సీట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికం అంటే ఇరవై దాకా జనసేనకు ఇవ్వాలన్నదే ప్రతిపాదనగా ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే మిగిలిన ముప్పై సీట్లలో పది నుంచి పన్నెండు దాకా ఉత్తరాంధ్రా జిల్లాలలో ఇవ్వాలని అంటున్నారు. ఇక క్రిష్ణా గుంటూరు జిల్లాలలో మరో ఎనిమిది సీట్లు ఇవ్వాలన్నది జనసేన కోరిక. గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఆరు జిల్లాల్లో పది సీట్లు కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అందులో కర్నూల్, చితూరు, ప్రకాశం జిల్లాలలో సీట్లు ఎక్కువగా తీసుకుంటారని అంటున్నారు.

తెలుగుదేశం జనసేన కలసి కూర్చున్న తొలి భేటీగా దీన్ని పేర్కొంటున్నారు. ఇది ఇంకా అనేక దఫాలుగా సాగనుంది అంటున్నారు. జనసేన మనసులో ఏముంది అన్నది తెలుసుకోవడానికే తెలుగుదేశం ఈ చర్చలకు తెర లేపింది అని అంటున్నారు. జనసేన మదిలో హాఫ్ సెంచరీ సీట్లు, సీఎం పోస్టు ఉండడం అంటే అది టీడీపీకి ఎంతమాత్రం అంగీకారం కానీ విషయమే.

అలాగే జనసేన కోరుకున్న చోట్ల సీట్లు ఇవ్వడం అంటే అది కూడా సాధ్యపడక పోవచ్చు అంటున్నారు. మరో వైపు యాభై సీట్లు అన్నది చాలా పెద్ద విషయం అని అంటున్నారు. తెలుగుదేశం లెక్కలు అంచనాలు ఎలా ఉన్నాయి అంటే జనసేన సహా మిత్రులు ఎవరు వచ్చినా ఆ పై పాతిక సీట్లలోనే సర్దేసి తాము కచ్చితంగా 150 సీట్లలో పోటీ చేయాలని అలాగైతేనే 88 మార్క్ మ్యాజిక్ ఫిగర్ కి చేరువ అవుతామని, ఎవరి అండా లేకుండా తాము అధికారంలోకి సులువుగా వస్తామని భావిస్తున్నారు.

అంతే కాదు ఏపీలో వైసీపీని ఓడించే క్రమంలో మరో పార్టీని పోటీగా తెచ్చుకోవాలన్న ఆలోచన కానీ ఉద్దేశ్యాలు కానీ కలలో కూడా టీడీపీకి ఉండవని అంటున్నారు. ఒక విధంగా జనసేనను ఊతంగా ఉడతా సాయం తీసుకుని మాత్రమే పవర్ లోకి రావాలని టీడీపీ చూస్తోంది. అయితే జనసేన లెక్కలు ఎలా ఉన్నాయంటే గత ఎన్నికల్లో తమ ఓంటరి పోటీ వల్ల టీడీపీకి దాదాపుగా నలభై నుంచి యాభై సీట్లలో దెబ్బ అయిందని, అందుకే ఆ సీట్లనే తాము కోరుతున్నామని అంటున్నారు.

ఇక సీఎం సీటు ని వాటాగా కోరడం సమంజసమే అంటున్నారు. మూడేళ్లు టీడీపీకి పెద్ద పార్టీగా వదిలేసినా తనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తాము ఉంటేనే తప్పక టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్న దృష్ట్యా తమకు సీఎం పోస్టు తప్పనిసరి అని జనసేన అంటోంది. అయితే ఇక్కడితో ఏవీ తేలవు, ఎన్నో సిట్టింగ్స్ జరగాలి. చివరికి పవన్ చంద్రబాబు ముఖా ముఖీ భేటీకావాలి. ఆ మీదటనే పొత్తులు కుదురుతాయని అంటున్నారు. ఒకటి మాత్రం స్పష్టం అంటున్నారు. ఏపీలో జనసేన టీడీపీల మధ్య పొత్తు కచ్చితంగా ఉంటుందని అయితే సీట్ల గొడవ ఎలా తెగుతుంది అంటే అది బాబు పవన్ ల చేతిలోనే ఉందని రెండు పార్టీల నేతలు అంటున్నారు.