Begin typing your search above and press return to search.

రెడ్లు అక్క‌ర్లేదా.. జ‌న‌సేనానీ...!

By:  Tupaki Desk   |   16 March 2023 5:00 AM GMT
రెడ్లు అక్క‌ర్లేదా.. జ‌న‌సేనానీ...!
X
అది రాజ‌కీయ‌మా..? సినిమానా.. అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జాక్షేత్రంలో ఉన్న‌వారికి.. ప‌బ్లిక్ ఫిగ‌ర్‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అవ‌స‌ర‌మే. అన్ని వ‌ర్గాల వారితోనూ వారికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే.. అన్ని వ‌ర్గాల వారిని చేరువ చేసుకునేందుకు వారిలో అభిమానం సంపాయించుకునేందుకు నాయ‌కులు, న‌టులు కూడా ప్ర‌య‌త్నిస్తారు. మ‌రి ఈ విష‌యం తెలుసున‌ని అనుకోవాలో.. తెలియ‌ద‌ని భావించాలో తెలియ‌దు కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాత్రం రెడ్డి వర్గంపై నిప్పులు చెరిగారు.

``ఆ ఒక్క కులం మాత్ర‌మే అన్ని ప‌ద‌వులు అనుభ‌విస్తోంది. ఆ ఒక్క కులం త‌ప్ప‌!`` అని తాజాగా జ‌రిగిన జ‌న‌సేన 10వ ఆవిర్భావ స‌భ‌లో ఆయ‌న రెడ్డి కులాన్ని నేరుగానే టార్గెట్ చేశారు. నిజానికి ఇది జ‌గ‌న్‌పై ఉన్న ధ్వేషంతోనే ప‌వ‌న్ ఇలా వ్యాఖ్యానించార‌నేది సుస్ప‌ష్టం. వాస్త‌వానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప‌వ‌న్ కంటే కూడా.. జ‌గ‌న్ అంటే మంటెత్తుతోంది. ఆయ‌న జ‌గ‌న్ బాధితుడు కూడా. అయినా.. కూడా రెడ్డి వ‌ర్గానికి మాత్రం ఆయ‌న చేరువ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వ్య‌క్తిగ‌త ద్వేషాన్ని కుల ద్వేషంగా మార్చితే ఏం జ‌రుగుతుందో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగా తెలు సు. అందుకే.. జ‌గ‌న్ పై ఉన్న అక్క‌సును, రాజ‌కీయ వైరాన్ని కూడా అక్క‌డికే ప‌రిమితం చేసుకున్నారు. కానీ, ప‌వ‌న్ మాత్రం రెడ్డి వ‌ర్గం మొత్తాన్ని క‌ట్ట‌గ‌ట్టి తిట్టిపోశార‌నేవ వాద‌న‌.. ఆవేద‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి అనంత‌పురం, నెల్లూరు, సీమ ప్రాంతాల్లో ప‌వ‌న్ సినిమా విడుద‌లైతే.. బ్యాన‌ర్లు క‌ట్టేది.. పూలు జ‌ల్లేది.. రెడ్డి వ‌ర్గ‌మేన‌ని.. రెడ్డి యువ‌తేన‌ని ఆయ‌న‌కు తెలియంది అంటే న‌మ్మ‌లేం.

కానీ, ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌క్క‌న పెట్టారు. కేవ‌లం ఇతర సామాజిక వ‌ర్గాల అభ్యున్న‌తి గురించే ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో ఇత‌ర సామాజిక వ‌ర్గాలు ముఖ్యంగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న‌వ‌ర్గాల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించాల్సిందే. కానీ, ప‌నిగ‌ట్టుకుని వ్య‌క్తిగ‌త ద్వేషాన్ని ఒక కులంపై రు్ద్దే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ల్ల‌ప‌వ‌న్‌కు వ‌చ్చేది ఏమీ లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఒక‌వైపు సీమ‌లో పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నాన‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. కీల‌క‌మైన సామాజిక వ‌ర్గాన్ని దూరం చేసుకునిఏం సాధిస్తార‌ని అంటున్నారు.

ఇక్క‌డ ఇంకో విష‌యం కూడా చెప్పాలి. ఇటీవ‌ల కాలం వ‌ర‌కు కూడా క‌మ్మ వ‌ర్గాన్ని జ‌గ‌న్ దూరం పెట్టారు. చంద్ర‌బాబుపై ఉన్న కోపం, అక్క‌సుతో ఆయ‌న క‌మ్మ వ‌ర్గంపై బుర‌ద జ‌ల్లిన ప‌రిస్థితి ఉంది. కానీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆ వ‌ర్గాన్ని కూడా చేర‌దీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం ద్వారా.. అంతో ఇంతో వేడి త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి ఇలా .. అన్ని పార్టీలూ వ్య‌వ‌హ‌రిస్తుంటే..ప‌వ‌న్ మాత్రం రెడ్డి వ‌ర్గాన్ని దూరం పెట్ట‌డం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.