Begin typing your search above and press return to search.

పవన్ సీఎం అని కలలు కనండి... కానీ... ?

By:  Tupaki Desk   |   12 May 2023 7:19 PM GMT
పవన్ సీఎం అని కలలు కనండి... కానీ... ?
X
ఆకాశ హర్మాలలో విహరించండి. పవన్ సీఎం కావాలని మంచి కలలు కనండి. తప్పు లేదు, కానీ ఆ కలలను వాస్తవంగా సాకారం చేసేందుకు కూడా ప్రయత్నం చేయాలని జన సైనికులకు అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో జరిగిన సభలో మాట్లాడుతూ తానూ ఎన్నో కలలు కంటూ ఉంటానని అన్నారు.

జనసేన ఏపీలో అధికారంలోకి రావాలని, తాను సీఎం కావాలని తానూ కలలు కంటానని, కానీ ఊహలలో తాను విహరించను అని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నపుడు వ్యూహాలు ఉండాలి కానీ ఆవేశం పనికిరాదు అని పవన్ సూచించారు. పవన్ మాట్లాడుతున్నపుడు పలుమార్లు ఆయన్ని సీఎం అంటూ జనసైనికులు కేకలు వేశారు. దాంతో పవన్ అసహనానికి లోను అయ్యారు.

ఇలా కేకలతో సీఎం ఎవరూ అవరు అది గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. మీకు నేను సీఎం కావాలీ అంటే జనసేనకు ఏకంగా 48 శాతం నుంచి యాభై శాతం ఓట్లు ఇవ్వాలని కోరారు. ఎక్కడ చూసినా జనసేనను గెలిపించేలా పరిస్థితి రావాలని ఆయన అన్నారు. ఇపుడు మన కర్తవ్యం ఏపీలో జగన్ సర్కార్ ని గద్దె దించడం అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

పొత్తులు కచ్చితంగా ఉంటాయి. రేపటి రోజున ఏపీలో అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వమే అని పవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు తాను పొత్తుల విషయంలో మాట్లాడానని, తెలుగుదేశం, బీజేపీ జనసేన కలసి పొత్తులతో ముందుకు వెళ్తాయని పవన్ అన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి అన్నది ఎన్నికల తరువాత అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎవరిని ఎన్ని సీట్లు వచ్చాయన్న దాని మీద, బలాబలాల మీద ఆధారపడి సీఎం పోస్ట్ ఎవరు అన్నది ఉంటుందని, దాని గురించి ఈ సమయంలో మరచిపోండి అని పవన్ సూచించారు. ముందు వైసీపీని ఓడించడం ఎలా అన్నదే ఆలోచించాలని అన్నారు.

జనసేన సిద్ధాంతాలను వాడవాడలా ప్రచారం చేయాలని, తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో వివరించాలని పవన్ సూచించారు. ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి తనకు వ్యూహాలు ఉన్నాయని, అది అరిస్తే అయిపోయేది కాదని పవన్ సైనికులకు సూచించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేన ముందుండి పని చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.

తాను ఏ విషయం దాచేది ఉండదని, తాను సొంత నిర్ణయాలు తీసుకోనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రాధమికంగానే అవగాహనతో ముందుకు వెళ్దామని అనుకున్నామని చెప్పుకొచ్చారు. పొత్తులు మాత్రం కచ్చితంగా ఉంటాయి, ఇది గుర్తు పెట్టుకోండి వాటిని స్వాగతించిన వారే నడవాలని కోరారు.

పొత్తుల విషయంలో కూడా గౌరవంగా వ్యవహరిస్తేనే అంటూ ఒక మెలికను పవన్ పెట్టారు. పెరిగిన జనసేన బలాన్ని ఆధారంగా చేసుకునే తాము సీట్లు అడుగుతామని అన్నారు. అన్ని విధాలుగా తాము బాధ్యతగా వ్యవహరిస్తామని పవన్ పేర్కొన్నారు. మొత్తానికి పవన్ పొత్తులు ఉంటాయని సీఎం విషయం మాత్రం ఎన్నికల తరువాత అంటూ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.