Begin typing your search above and press return to search.

రంగా ను మ‌రిచిపోయావా జ‌న‌సేనానీ?!

By:  Tupaki Desk   |   5 July 2023 10:11 PM GMT
రంగా ను మ‌రిచిపోయావా జ‌న‌సేనానీ?!
X
వంగ‌వీటి మోహ‌న‌రంగా. కాపు నాడు తో రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ నాయ‌కుడు. అయితే.. ఆయ‌న పేరు తో రాజకీయాలు చేయ‌డం.. ఇటీవ‌ల కాలం లో ఆయ‌నను ఎక్కువ‌గా ప్ర‌స్తావించ‌డం తెలిసిందే. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాల్లో రంగా అభిమానులు ఎక్కువ‌గా ఉన్నారు. అదేస‌మ‌యం లో కాపులు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. వీరిని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల్లో బ‌లోపేతం అయ్యేందుకు గ‌త రెండేళ్ల నుంచి అన్ని పార్టీలు ప్ర‌య‌త్నాలు చేశాయి.

రంగా వ‌ర్ధంతులు.. జ‌యంతుల‌ ను పార్టీల‌ కు అతీతంగా కూడా నిర్వ‌హించారు. అంతేకాదు.. త‌ర‌చుగా రంగా గురించి వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే.. కాపుల‌ ను ఐక్యంగా ఉంచాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా రంగా ప్ర‌స్తావ‌న ఎక్కువ‌గా తెచ్చారు. త‌న వారాహి ప‌ర్య‌ట‌న‌లు.. స‌హా ఎక్క‌డ కాపుల‌vకు సంబంధించిన స‌మావేశం నిర్వ‌హించినా.. రంగా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుతున్నారు. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ నుంచి ఆ పార్టీ నాయ‌కులు, మంత్రులు కూడా రంగా జ‌పం చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, రంగా వార‌సుడు వంగ‌వీటి రాధా ఏకంగా టీడీపీ లోనే ఉన్నారు. అంటే.. మొత్తంగా టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలు రంగా కు అనుకూలంగానే ఉన్నాయ‌ని చెప్పాలి. అయితే.. అనూహ్యంగా ఈ ఏడాది జూలై 4న రంగా 76వ జ‌యంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఏటా రంగా పేరు ను రాజ‌కీయంగా వాడుకునే పార్టీల‌న్నీ..ఒక్కసారిగా ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రిచిపోయిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది రంగా జ‌యంతి కి ట్వీట్ల‌తో రాజ‌కీయం చేసిన ప‌వ‌న్ కూడా.. ఈ సారి మౌనంగా ఉండిపోయారు. ఇక‌, వైసీపీ నాయ‌కులు కూడా.. ఎక్క‌డా పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

వైసీపీ కాపు నాయ‌కులు కూడా ఎక్క‌డ రంగా జ‌యంతి ని నిర్వ‌హించ‌లేదు. అయితే, రాధా స్నేహితుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం త‌న ఆఫీస్ లోనే రంగా చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. ఈ ప‌రిణామాల‌ తో అస‌లు ఏం జ‌రిగింది? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త ఏడాది రంగా చుట్టూ తిరిగిన రాజ‌కీయాలు.. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌ కు ముందు.. ఏ పార్టీ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం వెనుక.. రంగా ప్ర‌భావం త‌గ్గింద‌ని అనుకుంటున్నారా? లేక‌.. మ‌రేదైనా ఆలోచ‌న ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది. ముఖ్యంగా కాపు వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ పూర్తిగా రంగా ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది.