Begin typing your search above and press return to search.

లోకేష్ సీటుకు జనసేన ఎసరు...?

By:  Tupaki Desk   |   10 Jun 2023 2:48 PM GMT
లోకేష్ సీటుకు జనసేన ఎసరు...?
X
చంద్రబాబు పుత్రరత్నం, టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ పోటీ చేయబోతే సీటు మంగళగిరి. ఈ సీటులో 2019లో లోకేష్ ఫస్ట్ టైం పోటీ చేసి ఓడారు. ఈసారి మాత్రం ఓడిన చోట నుంచే గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని లోకేష్ పంతం మీద ఉన్నారు. ఆయన పాదయాత్రకు వెళ్ళే ముందు వరకూ మంగళగిరి మీదనే పూర్తి ఫోకస్ పెట్టారు.

లోకేష్ ని ఈసారి కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చేయాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది. అందుకే మంగళగిరిలో ఎక్కువగా ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం హనుమంతరావుని తెచ్చి ఎమ్మెల్సీని చేసింది. అలాగే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి అతి తక్కువ తేడాతో ఓడిన గంజి చిరంజీవికి రాష్ట్ర చేనేత విభాగం కన్వీనర్ గా నామినేటెడ్ పోస్ట్ ని ఇచ్చింది.

మంగళగిరిలోని కీలక టీడీపీ నేతలను చేర్చుకుంటోంది. రీసెంట్ గా మంగళగిరి పరిధిలోకి వచ్చేలా యాభై వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. దీంతో వైసీపీ లోకేష్ మీద గట్టిగానే గురి పెట్టింది అని అర్ధమవుతోంది.

ఈ నేపధ్యంలో టీడీపీ జనసేన పొత్తులు కనుక ఉంటే లోకేష్ గెలుస్తారు అని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ అనూహ్యంగా మంగళగిరి సీటు కావాలని జనసేన నుంచి వాయిస్ వినిపిస్తోంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత ఒకరు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు అని అంటున్నారు. చేనేతలకు ఎమ్మెల్యే సీటు మాత్రమే కాదు రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ లో కూడా సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఒక విధంగా ఇది టీడీపీకి ఇబ్బందిని కలిగించే అంశమే అవుతుంది అని అంటున్నారు. ఇన్నాళ్ళూ మంగళగిరి లోకేష్ సీటు అని తెలిసి ఆ వైపు చూడని జనసేన నుంచి ఇపుడే ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దానికి కారణం తాము కోరుకుంటున్న సీట్లలో టీడీపీ సీనియర్లు కర్చీఫ్ వేసి తమకు సీటు లేకుండా చేస్తున్నారని ఆగ్రహిస్తున్న జనసేన వ్యూహాత్మకంగానే మంగళగిరిని కెలుకుతోందని అంటున్నారు.

చంద్రబాబు కుమారుడిని మంగళగిరి ఫిక్స్ అయితే ఆ సీటు పొత్తులో ఎవరికీ ఇవ్వరు. ఆ సంగతి తెలిసి కూడా జనసేన నుంచి ఈ తరహా డిమాండ్లు వస్తున్నాయంటే టీడీపీ ఎత్తులకు పై ఎత్తు వేయడానికే అంటున్నారు. ఏకంగ చిన బాబు సీటుకే ఎసరు పెడితే తాము కోరుకుంటున్న తెనాలి సీటుతో పాటు చాలా సీట్లు పొత్తులో వస్తాయని జనసేన న్యూ స్ట్రాటజీని అమలు చేస్తోంది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే పొత్తుల వ్యవహారం మాత్రం టీడీపీ జనసేనల్లో ఇబ్బందిగానే ఉంది అంటున్నారు. సీట్లు కోరినన్ని ఇవ్వలేమని టీడీపీ అంటోంది. అలాగే తమకు బలం ఉంటే అసలు వదులుకోమని చెబుతోంది. మరి జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి కలిగే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వారాహీ టూర్ తో పొత్తుల కధ రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.