Begin typing your search above and press return to search.

పవన్... మళ్ళీ అదే మాట...

By:  Tupaki Desk   |   26 Jan 2023 9:00 PM GMT
పవన్... మళ్ళీ అదే మాట...
X
రాజకీయాల్లోకి వచ్చిన వారు నేను కచ్చితంగా అధికారంలోకి వస్తాను అని చెప్పాలి. అలా క్యాడర్ నుంచి జనాల్లోకి నమ్మకం కలిగిస్తేనే అవకాశాలు ఉంటాయి. జనం సైతం ఆలోచిస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాను సీఎం కావాలని కోరుకోవడం లేదు అన్న ఒకే మాటను ఎపుడూ అంటూ ఉంటారు. నిజానికి కోరుకుంటే వచ్చే పదవా అది. దానికి ఎంత కష్టపడాలి. అయిదు కోట్ల ఆంధ్రులకు అయిదేళ్లకు ఒకరు ఆ ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే ఎన్ని కోట్ల మందిలో ఒకరికి ఆ అవకాశం వస్తుందో ఆలోచిస్తే తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఆయనని అభిమానించే వారంతా నిరుత్సాహపడేలాగానే ఉన్నాయని అంటున్నారు. రాత్రికి రాత్రి సీఎం అయిపోవాలని అనుకోవడం లేదు అని అంటున్నారు పవన్. పవన్ రాజకీయం రాత్రికి రాత్రి మొదలు కాలేదు అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆయన తానుగా చెప్పుకున్నట్లుగానే 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014కి ముందు జనసేన పార్టీని స్థాపించారు. ఇప్పటికి చూస్తే తొమ్మిదేళ్ళు అవుతోంది. మరి ఇన్నాళ్ళూ ఆయన ఏమి చేశారు అన్న ప్రశ్నలు కూడా వస్తాయి.

పార్టీ నిర్మాణం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. మరి తొమ్మిదేళ్ళ సమయం చాలా తక్కువ సమయం అని పవన్ భావిస్తున్నారా అన్నది కూడా ఒక ప్రశ్నగా ముందుకు వస్తోంది. తన పార్టీని ఎపుడూ పటిష్టం చేసుకోవాలని పవన్ ఆలోచించలేదు అన్నది నిష్టూరమైన సత్యం. 2019లో ఓడాక ఆరు శాతానికి పైగా ఓట్లు వచ్చాక గడచిన నాలుగేళ్ల విలువైన కాలాన్ని పవన్ ఎందుకు వదిలేసుకున్నారు అన్నది కూడా ఆలోచించాల్సిన ప్రశ్న.

ఎంతసెపూ పార్టీ నిర్మాణం కష్టమని చెప్పడమే తప్ప పవన్ ఆ దిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదు అన్నది సగటు కార్యకర్తకు కూడా వచ్చే డౌట్. ఇక తనకు పదవులు అక్కరలేదు అంటూ జనాలు ఒప్పుకుంటే సీఎం అవుతాను అని పవన్ అంటున్నారు. ప్రజలు ఎపుడూ ఫలనా వారు రావాలని కావాలని అనుకోరు. వారు అద్దం లాంటి వారు. ఎవరు ముందు నిలిస్తే వారు బొమ్మ అక్కడ కనిపిస్తుంది.

పవన్ సైతం తాను ప్రజలలో ఉంటూ తనకు అధికారం కావాలని భావించడమే కాకుండా జనాలకు నమ్మకం కలిగిస్తేనే కచ్చితంగా ఆయన వైపు చూస్తారు. అంతే తప్ప ప్రజలు తాముగా ఒప్పుకోని ఇదిగో వరమాల అని ఏ నేతకూ వేసిన దాఖలాలు ఎపుడూ లేవు అంతటి మహా నటుడు ఎన్టీయార్ ర్ సైతం ఎండనకా వాననకా తొమ్మిది నెలల పాటు చైతన్య రధం మీద ఏపీ అంతా తిరిగి జనాలకు చేరువ అయితేనే ఆయన్ని ఆదరించి ఓట్లు వేశారు అన్నది ఎవరైనా గుర్తు చేసుకోవాలి.

ఇక కోడి కత్తితో పొడిపించుకుంటే జగన్ సీఎం అయిపోయారు అని చాలా లైట్ తీసుకుని పవన్ మాట్లాడుతున్నారు కానీ ఇదే జగన్ 2011 మేలో జరిగిన కడప లోక్ సభ ఉప ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి పోటీ చేసి అయిదున్నర లక్షల ఓట్లతో తానుగా గెలిచి నిరూపించుకున్నారని, ఆ తరువాత అనేక ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించారని, 2014లో 67 సీట్లు 44 శాతం పైగా ఓట్ల షేర్ సాధించి అధికారానికి చాలా చేరువగా వచ్చారని మరచిపోతే ఎలా అంటున్నారు.

అదే విధంగా విపక్ష నేతగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, 2017 నుంచి పాదయాత్ర వేల కిలోమీటర్లు చేశారు. ఇలా జనాలకు నమ్మకం కలిగించి పార్టీ పట్ల ఇతర నాయకులకు నమ్మకం కలిగించి పటిష్టం చేసుకుని ఎన్నికల బరిలో నిలిచి సీఎం అయ్యారు అన్నది చరిత్రలో ఉన్న విషయం. అంతే తప్ప చాలా ఈజీగా అయిపోయారు అని ఆలోచించడమే తప్పు. పవన్ జగన్ మీద ద్వేషాన్ని కాస్తా పక్కన పెట్టి ముందు తన పార్టీని పటిష్టం చేసుకోవాలని, అలాగే తాను సీఎం కావాలని కోరుకుంటున్న క్యాడర్ ఆశలు నెరవేర్చెలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కోరుతున్నారు.

వెనకటికి ఎవరో అందని ద్రాక్ష పుల్లన అని అన్నారట. అలా నాకు సీఎం పదవి వద్దు అని పవన్ అన్నా అది ఆయన దగ్గరకు ఎపుడు వచ్చింది ఎపుడు కాదన్నరు అన్నది కూడా చూడాలి. ఆ అందని ద్రాక్షను అందేలా చేసుకోవడమే రాజకీయం. ఆ దిశగా జనసేనాని కచ్చితమైన కార్యాచరణ ఉండాలి కానీ ఎదుటి పార్టీని ఓడిస్తాను అని చెప్పి చేసే రాజకీయం వల్ల జనసేనకు ఏమిటి లాభం అన్నది ఆలోచించాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.