Begin typing your search above and press return to search.

పంప‌కాల ప‌ర్వంలో లాభం ఎవ‌రికి ? జ‌న‌సేన విత్ టీడీపీ

By:  Tupaki Desk   |   16 March 2022 1:30 AM GMT
పంప‌కాల ప‌ర్వంలో లాభం ఎవ‌రికి ? జ‌న‌సేన విత్ టీడీపీ
X
ఎన్నిక‌ల‌కు చాలా దూరం ఉంది అని అనుకునేందుకు వీల్లేదు.వైసీపీ ప్లీన‌రీ (జూలై ఎనిమిదిన‌) అయిపోగానే ఎన్నిక‌ల వేడి ఒక్క‌సారిగా పెరిగి పోవ‌డం ఖాయం.ఆ విధంగా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు అన్నీ మారిపోవ‌డం త‌థ్యం.వాస్త‌వానికి వైసీపీ ఆవిర్భావ వేడుక క‌న్నా నిన్న‌టి స‌భే అతి పెద్ద చ‌ర్చ‌కు తావిచ్చింది.

ఒక స‌భ మూడు స్ప‌ష్ట‌త‌లు అని చాలామంది జ‌న సైనికులు సంబర‌ప‌డుతున్నారు.ఒక‌టి వైసీపీని తాము ఎలా అర్థం చేసుకుంటున్నామ‌న్న‌ది తేల్చారు.రెండు బీజేపీతో స్నేహం ఉందో లేదో కూడా రోడ్ మ్యాప్ ద్వారా చెప్పేశారు.వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల్చం అని చెప్పి టీడీపీతోనూ ఓ విధంగా మళ్లీ పొత్తు ఉంటే ఉండ‌వ‌చ్చు అన్న‌ది కూడా చెప్పేశారు.

ఇవీ ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు వెనుక ఉన్న అంత‌రార్థ స‌హిత భావాలు అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వ్యాఖ్యానిస్తున్నారు. త‌మదైన వివ‌ర‌ణనో విశ్లేష‌ణ‌నో ఇస్తున్నారు.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ గ‌తంలో చెప్పిన విధంగా లేదా చేసిన విధంగా త‌మ అధినేత త‌ప్పులు చేయ‌రు అనే భావిస్తున్నామ‌ని కూడా వీళ్లు ఆశిస్తున్నారు.

టీడీపీతో పొత్తు ఒక‌వేళ ఉంటే ఆ పార్టీ ఏయే స్థానాల‌ను అడుగుతుంది. టీడ‌పీతోనే కాకుండా బీజేపీతో కూడా స్నేహాస్తం ఉంటే అప్పుడు సీట్ల పంపకం ఎలా ఉంటుంది.ఉదాహ‌ర‌ణ‌కు పొత్తులో భాగంగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గంను ప‌వ‌న్ అడిగితే టీడీపీ వ‌దులుకుంటుందా లేదా అస్స‌లు ఈ పొత్తే వ‌ద్ద‌ని అనుకుంటుందా? ఎందుకంటే గ‌తంలో కూడా ఇలాంటి ఇబ్బందులే త‌లెత్తాయి క‌నుక టీడీపీ ని జ‌న‌సేన పూర్తిగా విశ్వ‌సించడం లేదు.

త‌మ అధినేతను గెలిపించే బాధ్య‌త‌ను పొత్తు భాగంగా ఆ రెండు పార్టీలూ భుజాన వేసుకోవాల్సిందేన‌ని కూడా అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు.ఇదే స‌మ‌యంలోటీడీపీలో మ‌రో టెన్ష‌న్ ఏంటంటే ఒక‌వేళ పొత్తులో భాగంగా తాము ఏం కోల్పోవాల్సి వ‌స్తుంది అన్న విష‌య‌మై ఆందోళ‌న‌పూరిత వాతావ‌ర‌ణం ఒక‌టి నెల‌కొని ఉంది.

ఎందుకంటే చంద్ర‌బాబు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల ఇంఛార్జులను నియ‌మిస్తున్నారు.తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బ‌గ్గు ర‌మ‌ణ మూర్తిని నియ‌మించారు.అంటే ఆయ‌నే త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌లకు ఆ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థి అని తేలిపోయింది.

ఇప్పుడు ఒక‌వేళ పొత్తు అన్న‌ది ఉంటే బీజేపీ అక్క‌డి నుంచి పోటీ చేయాలని అనుకుంటే టీడీపీ గ‌తేంటి? ఇదే పెద్ద త‌ల‌నొప్పి బాబుకు. ప‌ద‌వీ త్యాగం క‌న్నా పోటీ నుంచి త‌ప్పుకునేందుకు సిద్ధం కావ‌డం అన్న‌ది చాలా క‌ష్టం అయిన విష‌యం. అందుకే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా తాము నెగ్గ‌కుండా లేదా త‌మ‌ను నెగ్గ‌నివ్వ‌కుండా టీడీపీ మాత్ర‌మే ల‌బ్ధి పొందాల‌ని చూస్తే అలాంటి పొత్తు వ‌ద్దేవ‌ద్ద‌ని అంటున్నారు.ఇదే మాట సోష‌ల్ మీడియాలో చెబుతున్నారు కూడా !