Begin typing your search above and press return to search.

స్థానిక పోరులో జనసేన - బీజేపీ కలిసి అన్ని చోట్లా పోటీ చేస్తుందట!

By:  Tupaki Desk   |   27 Jan 2021 7:38 AM GMT
స్థానిక పోరులో జనసేన - బీజేపీ కలిసి అన్ని చోట్లా పోటీ చేస్తుందట!
X
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. స్థానిక ఎన్నికలకి ఈసీ ఏర్పాట్లు చకచకా చేస్తుండటంతో, అన్ని పార్టీలు కూడా తమ వ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం ఉదయం జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జనసేన , బీజేపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. ఈ సమావేశం లో జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాష్ట్ర ప్రజలు, శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేయకుండా, కొంతమందికే పరిమితమై నియంతలా పరిపాలిస్తున్నారని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఏకగ్రీవాల విషయంలో వైసీపీ చేసిన వ్యాఖ్య‌లపై బీజేపీ నేత‌ల‌తో క‌లిసి గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచందన్‌‌ ను కలుస్తామ‌ని తెలిపారు. వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నాయ‌ని చెప్పారు. ఎన్న‌డూ లేని విధంగా ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలు వేయిస్తున్నార‌ని తెలిపారు. ఎన్నిక‌లు శాంతియుత వాతావరణంలో జరగాలని నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు. ఏకగ్రీవాల విషయంలో గతంలో జ‌రిగిన‌ ఘటనల నేప‌థ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాలని నాదేండ్ల మనోహర్ కోరారు.

ఈ స‌మావేశంలో బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత స‌ర్కారుపై ఉందన్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వారిని బెదిరించే ధోరణిని అరికట్టాలని కోరారు.