Begin typing your search above and press return to search.

బాబుతో జనసేనాని కీలక భేటీ...క్లారిటీ వచ్చేసిందా...?

By:  Tupaki Desk   |   29 April 2023 7:54 PM GMT
బాబుతో జనసేనాని కీలక భేటీ...క్లారిటీ వచ్చేసిందా...?
X
సడెన్ గా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఇంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అయ్యారు. నిన్నటిదాకా విజయవాడలో ఉంటూ వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ కి వచ్చీ రావడంతోనే ఈ భేటీ జరిగింది. నిజానికి ఈ ఇద్దరి సమావేశం మీద ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. అదే విధంగా ఎలాంటి ప్రచారం లేదు. దాదాపుగా గంట పాటు ఈ భేటీ సాగింది.

అనూహ్యంగా బాబు ఇంట్లో పవన్ కనిపించడంతో ఇది రాజకీయంగా అత్యంత కీలకమైన భేటీగా భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఏడాది వ్యవధిలో మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంకా జనంలోకి రావాల్సి ఉంది. ఆయన వారాహి రధం రోడ్ల మీద పరుగులు తీయాల్సి ఉంది.

ఇవన్నీ జరగాలీ అంటే పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది అని అంటున్నారు. పొత్తులతో పాటు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు ఎలా కలసి వెళ్లాలన్న దాని మీదనే ఈ భేటీ సాగి ఉంటుందని అంటున్నారు. ఇక పవన్ ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలసి వచ్చారు.

ఆ మీటింగ్ కి సంబంధించిన విషయాలను కూడా ఈ భేటీలో పంచుకోవచ్చు అని అంటున్నారు. మరో వైపు చంద్రబాబు కానీ లోకేష్ కానీ చాలా నియోజకవర్గాలలో అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. దాంతో పొత్తుల విషయంలో ఎటూ తేలని నియోజకవర్గాలలో సందిగ్దం నెలకొంది.

ముందస్తుగా అభ్యర్ధులను ఖరారు చేసుకుంటే రెండు పార్టీలకు ఉపయోగకరమని మాట ఉంది. దాంతోనే ఈ సమావేశం జరిగిందా అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు పవన్ భేటీ ఇది వరసగా మూడవది కావడం విశేషం. దీంతో రెండు పార్టీలు పొత్తులు ఖాయమని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ మధ్యనే జనసేన క్యాడర్ కి బహిరంగ లేఖను రాసిన పవన్ అందులో పొత్తుల గురించి ప్రస్తావించారు. పొత్తుల విషయం మీద తానే సరైన సమయంలో కీలక డెసిషన్ తీసుకుంటాను అని చెప్పారు. రాజకీయంగా సయోధ్యతో ఉన్న పార్టీల విషయంలో నేతలు ఎవరైనా విమర్శలు చేసినా పట్టించుకోవద్దని పవన్ సూచించారు. దాంతోనే పొత్తుల విషయంలో పవన్ ఒక క్లారిటీకి వచ్చారని అంటున్నారు.

ఇక తాజా భేటీలో సైతం పొత్తుల అంశం అయితే ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని అంటున్నారు అయితే ప్రజా సమస్యల గురించి, ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి బాబు పవన్ చర్చించారని పార్టీ వర్గాలు అంటున్నారు. ఏది ఏమైనా ఈ భేటీని మాత్రం సీరియస్ గానే తీసుకోవాలని రాజకీయ ప్రాధాన్యత ఉన్నదే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.