Begin typing your search above and press return to search.

బందరులో నేడే జనసేన ఆవిర్భావ సభ.. పోలీసుల ఆంక్షలు షురూ!

By:  Tupaki Desk   |   14 March 2023 10:46 AM GMT
బందరులో నేడే జనసేన ఆవిర్భావ సభ.. పోలీసుల ఆంక్షలు షురూ!
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు)ను ఎంచుకున్నారు. పవన్‌ పై తీవ్ర విమర్శలు చేసే పేర్ని నాని ప్రస్తుతం బందరు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పవన్‌.. పేర్ని నానిపై మాటల తూటాలు పేల్చడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా జనసేన ఆవిర్భావ సభకు 36 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. ఇందుకు రైతులు భూములిచ్చారు. సభకు పోలీసుల అనుమతి కూడా లభించిందని జనసేన నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా యథావిధిగా జనసేన పార్టీకి షాకిచ్చారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, జిల్లా అంతటా పోలీసు యాక్ట్‌–30 ఉందని ప్రకటించారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జన జీవనానికి, ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగితే ఊరుకోబోమన్నారు.

మరోవైపు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి 5 లక్షల మంది వస్తారని అంచనాలు ఉన్న ,నేపథ్యంలో పోలీసులు జనసైనికులను ఎలా నియంత్రించగలరనేది ఉత్కంఠగా మారింది.

కాగా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ నోవాటెల్‌ హోటల్‌ నుంచి బయలుదేరుతారు. 1 గంటలకు విజయవాడ ఆటోనగర్‌ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారాహి వాహనం ద్వారా మచిలీపట్నం బయలుదేరుతారు.

ఈ క్రమంలో విజయవాడ– బందరు హైవేలో తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు – గుడివాడ సెంటర్‌ (బైపాస్‌), గూడూరు సెంటర్‌ మీదుగా 5 గం.కు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆవిర్భావ సభ వేదికపై ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులను ఆదుకోవడానికి వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. మొత్తం 55 కుటుంబాలకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయం చేస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.

వాస్తవానికి పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్‌ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో విజయవాడ ఆటోనగర్‌ నుంచి ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. కాగా ఆవిర్భావ సభలో పవన్‌ వచ్చే ఎన్నికల్లో పొత్తులు, తదితరాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.