Begin typing your search above and press return to search.

గుండె బ‌రువెక్కించే ఇంగ్లాండ్ క్రికెట‌ర్ క‌థ‌

By:  Tupaki Desk   |   12 April 2016 12:13 PM GMT
గుండె బ‌రువెక్కించే ఇంగ్లాండ్ క్రికెట‌ర్ క‌థ‌
X
ఈ ఇంగ్లాండ్ క్రికెట‌ర్ క‌థేంటో తెలిస్తే క్రికెట్ ప్రియుల‌కే కాదు.. సామాన్యుల‌కు కూడా గుండెలు బ‌రువెక్క‌క మాన‌వు. క్రికెట్ కెరీర్ మంచి ద‌శ‌లో ఉండ‌గానే.. 26 ఏళ్ల‌కే అత‌ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో త‌న‌కిష్ట‌మైన ఆట‌కు గుడ్ బై చెప్పేయాల్సిన దుస్థితి వ‌చ్చింది.ఆ ఆట‌గాడి పేరు జేమ్స్ టేల‌ర్‌. క్రికెట్ ప్రియుల‌కు ఈ పేరు ప‌రిచ‌య‌మే. ఇంగ్లాండ్ త‌ర‌ఫున 7 టెస్టులు - 27 వ‌న్డేలు ఆడాడీ యువ క్రికెట‌ర్. స‌చిన్ లాగా పొట్టిగా ఉంటూ స్టైలిష్ బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్న టేల‌ర్.. మంగ‌ళ‌వారం అనూహ్యంగా త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. టేల‌ర్ ప్రమాదకర గుండె జబ్బుతో బాధపడుతుండ‌ట‌మే ఈ అనూహ్య నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డానికి కార‌ణం.

''నా జీవితంలో ఇది క్లిష్టమైన సమయం. నా ప్రపంచం తలకిందులైంది. జీవన్మరణ పోరాటం చేస్తున్నా'' అంటూ జేమ్స్ ట్వీట్ చేశాడు. దీంతో పాటు తాను ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఫొటో కూడా పెట్టాడు టేల‌ర్. టేల‌ర్ ఇలా మృత్యు పోరాటం చేస్తున్న సంగ‌తి ఇంగ్లాండ్ క్రికెట్ వ‌ర్గాల‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వార్త తెలియగానే ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించాడు. మంచి భ‌విష్య‌త్ ఉన్న ఓ యువ ఆట‌గాడు ఇలాంటి స్థితికి చేర‌డం బాధాక‌రం. అత‌ను కోలుకుని మ‌ళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాల‌ని ఆశిద్దాం.