Begin typing your search above and press return to search.

ఆ జర్నలిస్టును చంపేశాక ఒవెన్‌ లో కాల్చేశారట

By:  Tupaki Desk   |   4 March 2019 5:07 PM GMT
ఆ జర్నలిస్టును చంపేశాక ఒవెన్‌ లో కాల్చేశారట
X
జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ... గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన హత్యకేసు ఇది. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఆయన్ను ఆ దేశమే చంపేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. టర్కీకి చెందిన ఖషోగీ అమెరికాలో ఉండేవారు. తాజాగా ఖషోగీ హత్యోదంతంపై అరబ్ దేశాలు కేంద్రంగా నడిచే ప్రముఖ మీడియా హౌస్ అల్ జజీరా సంచలనాత్మక కథనం ప్రసారం చేసింది. ఖషోగీని దారుణంగా చంపడంతో పాటు ఆయన్ను ఒవెన్‌ లో వేసి కాల్చేశారని ఆ కథనంలో పేర్కొంది.

ఖషోగీ హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజుదే ప్రధాన హస్తమని పలు దేశాలు కూడా ఆరోపించాయి. కానీ, కొద్దిరోజులుగా ఆ విషయం మరుగునపడిపోయింది. ఇలాంటి వేళ అల్ జజీరా తన కథనంతో మరోసారి సంచలనం రేపింది.

సౌదీ కాన్సులేట్ జనరల్ నివాసంలో ఓ పెద్ద ఓవెన్ ఉందని.. అక్కడే ఖషోగీని చంపి అందులో వేసి కాల్చి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోందంటూ కథనం ప్రసారం చేసింది ఆల్‌ జజీరా ఛానెల్. అంతేకాకుండా... తరువాత దానిపై విచారణ జరిగినా దొరక్కుండా ఖషోగీని కాల్చిన తరువాత మూడు రోజుల పాటు అదే ఒవెన్ లో మాంసం కాల్చారట. ఆనవాళ్లు దొరక్కుండా అలా చేశారని అల్ జజీరా కథనం ప్రసారం చేసింది. మరోవైపు ఖషోగీ హత్య జరిగిన వెంటనే టర్కీకి చెందిన విచారణాధికారులు కూడా విచారణ చేసేందుకు వెళ్లిన సమయంలో కాన్సులేట్ గోడలపై ఖషోగ్గికి చెందిన రక్తపు మరకలు గుర్తించారు. ఖషోగ్గిని చంపిన తర్వాత హంతకులు గోడపై మరకలు కనిపించకుండా పెయింట్ వేశారు. విచారణాధికారులు వెళ్లి ఆ పెయింట్‌ను తొలగించగా కింద రక్తపు మరకలు కనపించినట్లు గతేడాది వాషింగ్టన్ పోస్టు తన కథనంలో వెల్లడించింది. ఈ కథనాలే నిజమైతే అమెరికా సౌదీపై తీవ్ర చర్యలు తీసుకోవడం గ్యారంటీ అని అరబ్ దేశాల్లో ప్రచారం జరుగుతోంది.