Begin typing your search above and press return to search.

ఏపీలో జగనన్న మహిళా మార్ట్.. పులివెందుల సక్సెస్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా!!

By:  Tupaki Desk   |   3 Feb 2021 5:46 AM GMT
ఏపీలో జగనన్న మహిళా మార్ట్.. పులివెందుల సక్సెస్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా!!
X
ఒకటి తర్వాత ఒకటిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పరంపరలో ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమం చేపట్టింది. ప్రయోగాత్మకంగా కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ సక్సెస్ కావటంతో.. అదే తరహాలో ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా నిర్వహించే జగనన్న మహిళా మార్ట్ లు.. సూపర్ మార్కెట్ల మాదిరి నిర్వహించనున్నారు.

రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు.. మున్సిపాలిటీల్లో దశల వారీగా నిర్వహించనున్నారు. ఇందుకు పురపాలిక శాఖ.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్థిక సాయాన్ని అందించనుంది. మహిళా సమాఖ్య సభ్యులు జమ చేసే మొత్తాలతో రూ.15 నుంచి రూ.25 లక్షల పెట్టుబడి నిధిని సమకూరుస్తారు. దీనికి అదనంగా మెప్మా రూ.3లక్షల మొత్తాన్ని సమకూర్చనుంది. అంతేకాదు..సంబంధిత మున్సిపాలిటీ స్థలాన్ని సమకూర్చటమే కాదు.. సంస్థ సహకారంతో భవనాన్ని నిర్మిస్తారు. వీటికి రాష్ట్ర సర్కారు పలు సంక్షేమ పథకాలతో చేయూతను ఇస్తుంది.

సూపర్ మార్కెట్లలో విక్రయించే సరకుల సరఫరాకు.. కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవటానికి వీలుగా మెప్మా సహకారాన్ని అందిస్తుంది. వీటి నిర్వహణ కోసం సమాఖ్యలోని 10 మంది సభ్యుల కమిటిని మెప్మా నియమిస్తుంది. మరో 10 మంది సిబ్బందిని నియమిస్తారు. ఈ మార్ట్ లు ఆర్నెల్లలోనే లాభాల్లోకి వస్తున్నాయి. ఇందులోని వాటాను సమాఖ్య సభ్యులకు ఆర్నెల్లకోసారి డివిడెండ్ రూపంలో పంచుతారు. ఇదే విధానాన్నికడప జిల్లా పులివెందులలో విజయవంతంగా అమలు చేశారు. అక్కడి సక్సెస్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో వీటిని తెర మీదకు తీసుకురావాలని భావిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా పులివెందులలో ప్రారంభించిన జగనన్న మహిళా మార్ట్ విజయం సాధించటంతో పాటు.. నెలకు రూ.10లక్షల టర్నోవర్ కు చేరుకుంది. ఈ పథకం మహిళల ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.