Begin typing your search above and press return to search.

జగన్ అత్యవసర భేటీ....ఎలా ముందుకెళ్ళాలి...?

By:  Tupaki Desk   |   17 April 2023 2:00 PM GMT
జగన్ అత్యవసర భేటీ....ఎలా ముందుకెళ్ళాలి...?
X
అధికార వైసీపీ ఇపుడు అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక వైపు కడప జిల్లాలో సీనియర్ నేత, మరో వైపు జగన్ కి సన్నిహిత బంధువు అయిన వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ని సీబీఐ టార్గెట్ చేసిన నేపధ్యంలో తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ ముఖ్య నేతలతో అత్యవసర భేటీని నిర్వహించారని తెలుస్తోంది.

ఈ భేటీకి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారని తెలుస్తోంది. సీబీఐ దూకుడు పెంచిన నేపధ్యంలో ప్రస్తుత అరెస్ట్ తో పాటు తదుపరి అరెస్టులు ఉంటాయా ఉంటే ఎలా ముందుకు వెళ్లాలి అన్న దాని మీద జగన్ ఈ అత్యవసర భేటీని నిర్వహించినట్లుగా తెలిసింది.

ఏపీ మొత్తాన్ని ప్రభావితం చేసే కేసుగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఉంది. మరో వైపు వైసీపీకి హార్డ్ కోర్ సబ్ రీజియన్ గా ఉన్న రాయలసీమ, దానికి కేంద్ర బిందువు సొంత ఇలాకా అయిన కడపను ఇంకా ఈ కేసు అరెస్టులు తదనంతర పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

పైగా అటూ ఇటూ బంధువులు సొంత వారే ఉన్నారు. ఈ కేసులో వరస అరెస్టులు రాజకీయంగా కూడా తీవ్ర మైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. వైసీపీని ఏర్పాటు చేశాక జగన్ మీద ఎన్నో కేసులు పడ్డాయి. అలా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఆ పార్టీ గతంలో విపక్షంలో ఉన్నపుడు ఎదుర్కొంది.

అయితే వాటి అన్నింటి కంటే కూడా ఇపుడు అత్యంత క్లిష్ట పరిస్థితినే పార్టీ ఎదుర్కోబోతోంది అని అంటున్నారు. పట్టుమని చూస్తే ఏడాది కూడా ఎన్నికలకు సమయంలేదు. ఇపుడు ఈ కేసు అరెస్టులు అన్నీ కూడా వైసీపీకి తీవ్ర ప్రతికూలతను రాజకీయంగా చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

సీమ రాజకీయాల్లో కూడా భారీ మార్పులకు ఈ కేసులు అరెస్టులు దారి తీసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒక విధంగా వైసీపీ అధినాయకత్వం ఇపుడు అతి పెద్ద ఇబ్బందిలో కూరుకుపోయింది అనే అంటున్నారు. ముందుకు ఎలా వెళ్లాలి అన్నది కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. కడప జిల్లా వైసీపీ రాజకీయం మొత్తం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కంట్రోల్ లో ఉంది. ఆయన తొమ్మిదేళ్ళుగా ఎంపీగా ఉంటూ పార్టీ మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

అదే విధంగా పులివెందుల దాకా చూస్తే వైఎస్ భాస్కరరెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన కనుసన్ననలో పార్టీ అక్కడ నడుస్తోంది. ఇపుడు ఈ ఇద్దరి మీద సీబీఐ గురి పెట్టిన నేపధ్యంలో పార్టీ సంస్థాగతంగా కూడా బిగ్ ట్రబుల్స్ ని ఎదుర్కొంటుంది అని అంటున్నారు. అదే విధంగా చూసే కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి పవర్ ఫుల్ ఇమేజ్ ఉంది. ఈ కేసులు అరెస్టుల మూలంగా అది పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రత్యర్ధులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో సైతం వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉంటే అది సహజ పరిణామం. అలాగే వైసీపీలో లోకల్ లీడర్స్ మీద అక్కడక్కడ వ్యతిరేకత ఉండొచ్చు. టోటల్ గా ప్రాంతీయ పార్టీగా దానికి కేంద్ర బిందువు అయిన వారి మీద మాత్రం జనాల్లో పాజిటివ్ భావనే ఉంది. ఇపుడు కేసు తదనంతర పరిణామాల వల్ల ఏదైనా కొత్త ఇబ్బందులు వస్తే ఏపీలో కూడా వైసీపీకి అది సంకట పరిస్థితులకు దారి తీస్తుందా అన్నదే చర్చగా ఉంది.

ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని ట్రబుల్స్ మధ్యన వైసీపీ ఉంది. ఎలా ముందుకు సాగాలి అన్నది కనుక ఒక కచ్చితమైన ఆలోచన కార్యాచరణ వస్తే కనుక వైసీపీ బయటపడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి మాజీ మంత్రి వివేకా హత్య కేసు వైసీపీని వెంటాడుతోందని అంటున్నారు. ఈ పరిణామాలను విపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి.