Begin typing your search above and press return to search.

మంత్రులకు విశాఖకు ఎప్పుడు వెళుతున్నది చెప్పేసిన జగన్

By:  Tupaki Desk   |   14 March 2023 5:05 PM GMT
మంత్రులకు విశాఖకు ఎప్పుడు వెళుతున్నది చెప్పేసిన జగన్
X
ఏపీ రాజధాని అమరావతికి బదులుగా మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకోవటం.. ఆ దిశగా ప్రయత్నాలు షురూ చేయటం.. పలు అడ్డంకుల నేపథ్యంలో.. మూడు రాజధానుల నిర్ణయం అమల్లోకి వచ్చేనా? లేదా? అన్న సందేహాలు రావటం తెలిసిందే. అయితే.. తనకు అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ విశాఖకు పాలనను తరలించటం ఖాయమన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది.

ఈ రోజు నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ భేటీ సాగింది. ఇందులో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిగా విశాఖలో పాలనను జులై నుంచి ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. జులై లో ఏపీ ప్రభుత్వ పాలన విశాఖ పట్నానికి షిఫ్టు అయ్యే ముహుర్తం ఫిక్సు అయిపోయినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. విశాఖకు తాను షిఫ్టు కానున్న విషయాన్ని ప్రకటించారే కానీ.. అదెప్పటి నుంచి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించింది లేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్య నేపథ్యంలో జులై నుంచి పాలనా రాజధానిగా విశాఖను మార్చే ముహుర్తాన్ని చెప్పేసినట్లే. జూన్ మొదటి వారం నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కావటం.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగులు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా తాజా వ్యాఖ్య చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది.

ఏపీ పాలనా రాజధానిగా విశాఖ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కూడా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా తాను అప్పజెప్పిన బాధ్యతను సరిగా పూర్తి చేయని మంత్రులకు పదవుల ముప్పు ఉంటుందన్న వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. తాజా ప్రకటనతో విశాఖ పరిపాలన రాజధానిగా ఎప్పటి నుంచి అన్న విషయంపై స్పష్టత వచ్చేసినట్లుగా చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.