Begin typing your search above and press return to search.

టీడీపీ- జనసేన పొత్తును చిత్తు చేసే జగన్‌ మంత్రం ఇదేనా?

By:  Tupaki Desk   |   16 March 2023 6:00 PM GMT
టీడీపీ- జనసేన పొత్తును చిత్తు చేసే జగన్‌ మంత్రం ఇదేనా?
X
కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టత వచ్చేసినట్టేనని అంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. అధికార వైసీపీ కూడా టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని ధ్రువీకరించుకుంది. ఆ పార్టీ నేతల తాజా విమర్శలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి పరాజయం ఖాయమని సర్వత్రా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పొత్తును చిత్తు చేయడానికి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ తనదైన వ్యూహాలతో ముందుకు కదులుతున్నారని అంటున్నారు. ప్రతిపక్షాల పొత్తును చిత్తు చేయడానికి జగన్‌ దగ్గర కొన్ని మంత్రాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయమని జగన్‌ ధీమాగా ఉన్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో వృద్ధులకు రూ.2750 పెన్షన్‌ ఇస్తున్నారు. దీన్ని 2024 జనవరి నాటికి రూ.3 వేలు చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఫించన్లు తీసుకునేవారు దాదాపు 60 లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరికీ దాదాపు ప్రతి నెలా 1వ తేదీనే వారి ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పింఛన్‌ అందిస్తున్నారు. పింఛన్‌ లబ్ధిదారులంతా తమకే ఓటేస్తారని వైసీపీ అధినేత జగన్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు.

అలాగే పేదలకు ఇళ్లు స్కీమ్‌ కింద దాదాపు 35 లక్షల మంది మహిళలకు వాళ్ల పేరుతోనే జగన్‌ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీరిలో కొంతమందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది. వీరు కూడా తమకే ఓటేస్తారని జగన్‌ పెద్ద ఆశలు పెట్టుకున్నారు.

అలాగే వైఎస్సార్‌ ఆసరా కింద మహిళా సంఘాలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తుండటంతో వీరు కూడా వైసీపీకే ఓట్లేస్తారని వైసీపీ నమ్ముతోంది. డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో 90 లక్షల మంది ఉన్నారని చెబుతున్నారు. అంటే మొత్తం మీద దాదాపు కోటిన్నర మంది మహిళలు తమకే ఓట్లేస్తారని.. తద్వారా టీడీపీ, జనసేన కూటమిని చిత్తు చేయొచ్చనేది జగన్‌ ధీమాగా ఉందని పేర్కొంటున్నారు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ ఫించన్‌ లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు. వచ్చే జనవరి నుంచి వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ ను రూ. 3000కు పెంచుతామని తెలిపారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వేను శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా జగన్‌ అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ప్రస్తుతం ప్రతినెలా ఇస్తున్న రూ.2750 పించన్‌ ను వచ్చే జనవరి నుంచి రూ.3 వేలకు పెంచుతామని తెలిపారు. పెన్షన్‌ 3000 రూపాయలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. దీన్ని బట్టి పెన్షన్‌ పెంపు మంత్రంతోనే టీడీపీ-జనసేన కూటమిని ఎదుర్కోవడానికి జగన్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే అనేక రకాల పథకాలు.. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, జగనన్న చేదోడు, వాహన మిత్ర, మత్య్సకార భరోసా, నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు వంటి పథకాలను జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకాల లబ్ధిదారులంతా తమకే ఓట్లేస్తారని జగన్‌ బలంగా విశ్వసిస్తున్నారు. 2009లో తన తండ్రి వైఎస్సార్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినట్టే తాను కూడా వస్తానని బలంగా నమ్ముతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.