Begin typing your search above and press return to search.

సీఎం కాగానే సిస్టమేటిగ్గా చంద్రబాబు పని పడతా

By:  Tupaki Desk   |   7 Jan 2019 6:42 AM GMT
సీఎం కాగానే సిస్టమేటిగ్గా చంద్రబాబు పని పడతా
X
చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో రూ.6.17 లక్షల కోట్లు దోచుకున్నారని వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డి ఆరోపించారు. దీనిపై తాము తాజాగా వేసిన పుస్తకంలో అన్ని వివరాలూ ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని.. తగిన ఆధారాలు దొరికితే కేంద్ర సంస్థలు - స్వతంత్ర సంస్థలకు అప్పగించి దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. ఆధారాలు ఉన్నప్పుడు శిక్షలు పడడం ఖాయమన్నారు.

చంద్రబాబు దోపిడికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని... అవన్నీ దర్యాప్తు సంస్ధలకు ఇస్తామని జగన్ చెప్పారు. జగన్ మాటలను బట్టి చూస్తే తాను అధికారంలోకి వస్తే చంద్రబాబును వెంటాడడం ఖాయమని చెప్పకనే చెప్పారు.

అయితే.. ఏపీ రాజకీయ చరిత్ర చూస్తే ఇలా రాజకీయ కక్షను తీర్చుకున్న చరిత్ర పెద్దగా లేదు. అధికారంలోకి వచ్చాక మునుపటి ప్రభుత్వ అవినీతిని బయటకు లాగుతామని చెప్పడమే కానీ లాగిన చరిత్ర లేదు. అప్పటికే ఉన్న కేసులు వాటికవి ముందుకు సాగడం... ఒక్కోసారి ప్రభుత్వాలు నీరుగార్చడం జరుగుతోంది. అయితే... అవినీతి ఆరోపణలను ప్రతిసారీ బెదిరింపులకు ఉపయోగించుకోవడం వరకు చేస్తున్నారు.

నాలుగేళ్ళ కిందటి ఓటుకు నోటు కేసే దీనిక ఉదాహరణ. అసలు సూత్రదారి చంద్రబాబేనని టీఆరెస్ అంటున్నా ఇప్పటివరకు ఆయన్ను ఏమీ చేయలేదు. కేవలం కేసును బయటకు తీస్తామని బెదిరిస్తూ రాజకీయం చేస్తున్నారు.

చంద్రబాబు అవినీతిపై గతంలో వైఎస్ ముఖ్యమంత్రి ఉండగా మాజీ మంత్రి రోశయ్య నేతృత్వంలో కమిటీలు వేసి ఊరుకున్నారు. అప్పటికే చంద్రబాబు పైన కూడా ఏలేరు కుంభకోణం లాంటి చాలా కేసులే నమోదై, కమిషన్లు విచారణ చేశాయి. కానీ అన్నీ తూతూమంత్రమే.

ఈ నేపథ్యంలో జగన్ మరి ఎంతవరకు అనుకున్నది సాధిస్తారు.. చంద్రబాబు అవినీతిని శిక్షల వరకు ఎలా తీసుకెళ్తారన్నది చూడాలి.