Begin typing your search above and press return to search.

టీడీపీకి అసలు సినిమా మొదలైందా..అదే టెన్షన్!

By:  Tupaki Desk   |   28 May 2019 2:30 PM GMT
టీడీపీకి అసలు సినిమా మొదలైందా..అదే టెన్షన్!
X
ఒకవైపు ఎన్నికల్లో ఘోర వైఫల్యం. ఈ వైఫల్యాన్ని ఎవరి మీదకు నెట్టాలో అర్థం కాని పరిస్థితి. స్వయంగా చంద్రబాబు నాయుడి తనయుడే ఎన్నికల్లో ఓడిపోయారు. చంద్రబాబు మెజారిటీ సగానికి సగం ఆవిరి అయ్యింది. తెలుగుదేశం పార్టీ తరఫున సవాళ్లు విసిరిన వాళ్లు చాలెంజ్ లు చేసిన వాళ్లు దశాబ్దాల నుంచి పార్టీలో తిరుగులేని శక్తులుగా చలామణి అయిన వారు.. వారు, వీరు అనే తేడాలు లేకుండా అందరూ ఓడారు. ఏదో నామమాత్రంగా ప్రాతినిధ్యం మాత్రమే లభించింది. గెలిచిన వారిలో ఎంతమంది పార్టీలో ఉంటారో అనేది మరో సందేహం.

అధికారం లేకపోతే రాజకీయాల్లో ఉండటం వేస్ట్ అన్నట్టుగా పరిస్థితిని మార్చింది మరెవరో కాదు చంద్రబాబు నాయుడే! గత ఐదేళ్లలో ఫిరాయింపు రాజకీయాలను తెగ ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండాలంటే అధికారం తప్పనిసరి అనే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇలాంటి నేపథ్యంలో రాబోయే ఐదేళ్ల ప్రతిపక్ష వాసం తెలుగుదేశం పార్టీకి ఊహించుకుంటేనే భయంకరమైనదిగా అగుపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అందులోనూ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఇంతలా తిరస్కరించడానికి ముఖ్య కారణం 'అవినీతి' అనే మాట విశ్లేషణ ఉండనే ఉంది. తెలుగుదేశం పార్టీ వారు దోపిడీ చేయని వ్యవహారం అంటూ ఏదీ లేదని ఇసుక నుంచి కూడా కోట్లు సంపాదించుకోవచ్చని అనేక మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరూపించారని ఐదేళ్ల నుంచి అనేక మంది చెబుతూనే ఉన్నారు.

కేవలం అదొక్కటే కాదు.. ఎవరికి చేతికందిన వ్యవహారాల్లో వారు దండుకున్నారనే మాట వినిపించింది ఐదేళ్ల పాటు. స్వయంగా చినబాబు లోకేష్ కు బోలెడన్ని అవినీతి వ్యవహారాల్లో ప్రమేయం ఉందనే ఆరోపణ ఉంది. నీరు-చెట్టు దోపిడీలో ప్రధాన వాటాలు చినబాబుకే అందాయని.. అక్కడితో మొదలుపెడితే అనేక స్కామ్ లు చినబాబు ఆఫీసే కేంద్రంగా నిలిచిందని అంటారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం- పట్టిసీమ వ్యవహారాల్లో దేవినేని ఉమ భారీగా దండుకున్నారని, ఆయన అవినీతికి హద్దే లేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు చర్చలోకి వస్తూ ఉన్నాయి.

ఇక ఇవే అనుకుంటే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యకాండలకూ లోటు లేదు. పచ్చచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరూ జనాల మీద రుబాబు చేశారు. జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే.. ఎమ్మెల్యేల వరకూ అనేక మంది అనేక రకాలుగా దౌర్జన్యాలతో వార్తల్లోకి వచ్చారు.

వాటన్నింటికీ ప్రజల తీర్పు ప్రజలు ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. ఇక అసలు సినిమా ఇకపై మొదలవుతుందనే మాట వినిపిస్తోంది. అవినీతి వ్యవహారాలపై విచారణలు, దౌర్జన్యకాండలకు సంబంధించిన కేసుల్లో కదలికలు ఇకపై ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అవతల జగన్ చూస్తే చాలా కామ్ గా ఉన్నారు. 'కక్ష సాధింపు చర్యలు ఉండవు..' అని జగన్ తేల్చేశారు. అయితే ఏ రాజకీయ నేత కూడా కక్ష సాధిస్తాం అని చెప్పరు - అలాగే ఏ చర్య చోటు చేసుకున్నా.. అది 'కక్ష సాధింపు' కాదు అనే అంటారు. వారు చేసిన తప్పులకు పర్యవసనం అనే అంటారు. అలాంటి పర్యవసనాలే ఎలా ఉంటాయో.. అనే అంశం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ కొన్ని స్కాముల్లో ఇన్ వాల్వ్ అయిన వారు తెలుగుదేశాన్ని వీడి బీజేపీలోకి చేరే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే వార్తలు వస్తూ ఉండటం.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తేటతెల్లం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.