Begin typing your search above and press return to search.

నెల్లూరు పెద్దారెడ్లపై జగన్‌ వ్యూహం ఇదే!

By:  Tupaki Desk   |   4 July 2023 12:14 PM GMT
నెల్లూరు పెద్దారెడ్లపై జగన్‌ వ్యూహం ఇదే!
X
వైసీపీ కంచుకోట జిల్లాల్లో ఒకటి.. నెల్లూరు. గత ఎన్నికల్లో ఇక్కడ పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా రాలేదు. అయితే అనూహ్యంగా వైసీపీలో ముగ్గురు పెద్దారెడ్లు కలకలం సృష్టించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఆనం రాంనారాయణ రెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (నెల్లూరు రూరల్‌) రెబల్‌ ఎమ్మెల్యేలుగా మారారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంటూ వైసీపీ అధినేత జగన్‌ ఈ ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించారు.

అయితే ఆనం, మేకపాటి కుటుంబాలకు నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. జిల్లాలో పలు నియోజకవర్గాలను వీరు ప్రభావితం చేయగలరు. అలాగే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సైతం 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నుంచి వరుసగా విజయం సాధించారు. తాజాగా నారా లోకేశ్‌ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఎత్తున జనాన్ని సమీకరించి నెల్లూరులో తన పట్టును నిలుపుకున్నారు.

వైసీపీకి కంచుకోటలాంటి నెల్లూరు జిల్లాలో పార్టీకి ఈ పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండటంతో జగన్‌ సైతం ధీటుగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు ఆనం, మేకపాటి కుటుంబాలకు చెందినవారిని పార్టీలోకి చేర్చుకుని రెబల్‌ ఎమ్మెల్యేలకు ఝులక్‌ ఇచ్చారు.

ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డిని ఇంచార్జిగా తప్పించడంతో ఆయన మరో సోదరుడు మేకపాటి రాజగోపాలరెడ్డిని రెండు రోజుల క్రితం జగన్‌ ఇంచార్జిగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తే ఆయనపై ఆయన సొంత తమ్ముడు మేకపాటి రాజగోపాలరెడ్డి వైసీపీ తరఫున బరిలోకి దిగుతారు.

అలాగే నెల్లూరు జిల్లాలో పలు పర్యాయాలు వివిధ నియోజకవర్గాల నుంచి గెలిచిన చరిత్ర, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న ఆనం రాంనారాయణరెడ్డికి చెక్‌ పెట్టడానికి అదే కుటుంబానికి చెందిన ఆనం జయకుమార్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే ఆనం కుటుంబానికే చెందిన ఆనం విజయకుమార్‌ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఆనం జయకుమార్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో తాడేపల్లిలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనం రాంనారాయణరెడ్డిపైన ఆనం జయకుమార్‌ రెడ్డిని బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాక ఆయన తమ్ముడు, వైసీపీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డిని నెల్లూరు రూరల్‌ ఇంచార్జిగా నియమించాలని జగన్‌ భావించారు. అయితే గిరిధర్‌ రెడ్డి అన్నబాటలోనే న డవడంతో ఆయనను కూడా వైసీపీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డిని జగన్‌ నెల్లూరు రూరల్‌ ఇంచార్జిగా నియమించారు. గిరిధర్‌ రెడ్డి తన అన్నబాటలోనే నడవకుండా ఉంటే వైసీపీ అభ్యర్థిగా ఆయనే ఉండేవారని అంటున్నారు. మరి రెబల్‌ ఎమ్మెల్యేలపై జగన్‌ వ్యూహం విజయవంతమవుతుందో, లేదో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.