Begin typing your search above and press return to search.

హోదా సాధ‌న‌పై జ‌'గ‌న్' కీల‌క ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   1 April 2018 7:02 AM GMT
హోదా సాధ‌న‌పై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
X
ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న అంశంపై మొద‌ట్నించి ఒకేత‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ను చేశారు. హోదాపై ఇప్ప‌టికే లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం పెట్టిస్తున్న ఆయ‌న‌.. తాజాగా మరో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఊపిరి అని.. ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీలు ముందుకు వ‌చ్చినా..రాకున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని ప‌క్షంలో త‌మ పార్టీ ఎంపీలంతా పార్ల‌మెంటు చివ‌రి రోజున రాజీనామాలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇది పాత విష‌య‌మే క‌దా? అన్న క్వ‌శ్చ‌న్ వ‌చ్చే వారికి దిమ్మ తిరిగిపోయేలా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన అనంత‌రం..నేరుగా ఏపీ భ‌వ‌న్ కు వెళ్లి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌డ‌తార‌ని ప్ర‌క‌టించారు. తాము చేప‌ట్టే ఈ ఆందోళ‌న‌కు ఏపీ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

ఎంపీలు చేప‌ట్టే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు ఢిల్లీకి విద్యార్తులు.. యువ‌త‌.. ప్ర‌జ‌లంతా ఢిల్లీకి క‌ద‌లి రావాలంటూ పిలుపును ఇచ్చారు. ఎంపీలు చేప‌ట్టే ఆమ‌ర‌ణ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనూ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ అధికార‌ప‌క్షం చేస్తున్న డ్రామాల‌కు చెక్ పెట్టేందుకు... హోదా వ్య‌వ‌హారంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవ‌టానికి వీలుగా జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

నాలుగేళ్లుగా మోడీ స‌ర్కారుకు మ‌ద్ద‌తు ఇచ్చిన చంద్ర‌బాబు.. ఈ రోజు హోదా సాధ‌న కోసం తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నార‌ని.. హోదా కోసం ఆయ‌న చేసిన అన్యాయాల‌పై తాను సంధించే ఆరు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

జ‌గ‌న్ సంధించిన ఆరు ప్ర‌శ్న‌లేమంటే..

1. ఆ ఏడు నెల‌లు ఏం చేశావు బాబు? 2014న రాష్ట్రాన్ని విడ‌గొట్టిన త‌ర్వాత అప్ప‌టి కేంద్రం హోదా ఇవ్వాల‌ని భావించి.. కేబినేట్ తీర్మానం ఆమోదించింది. ప్లానింగ్ క‌మిష‌న్ కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. బాబు సీఎం అయ్యింది 2014 జూన్ లో. త‌ర్వాత డిసెంబ‌రు 2014 వ‌ర‌కూ ఏడు నెల‌లు హోదా ఫైలు ప్లానింగ్ క‌మిష‌న్ వ‌ద్దే ఉంది. మ‌రి.. ఏడు నెల‌ల పాటు బాబు స‌ర్కారు గాడిద‌లు కాసిందా? ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి హోదా కోసం క‌నీసం ఎందుకు అడ‌గ‌లేదు?

2. జైట్లీ ప్యాకేజీ రోజున‌.. మాకు హోదానే ముద్దు.. ప్యాకేజీ కాద‌ని ఎందుకు తిప్పి కొట్ట‌లేదు? సెప్టెంబ‌రు 8, 2016న హోదాకు బ‌దులుగా అబ‌ద్ధ‌పు ప్యాకేజీని అర్థ‌రాత్రి వేళ ఆర్థిక‌మంత్రి జైట్లీ ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య‌నే అదే త‌ర‌హా ప్ర‌క‌ట‌న జైట్లీ చేశారు. నాడు మంత్రుల చేత రాజీనామాలు చేయించ‌ని బాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా త‌న మంత్రుల చేత బాబు ఎందుకు రాజీనామా చేయించిన‌ట్లు? జైట్లీ చేసిన రెండు ప్ర‌క‌ట‌న‌ల మ‌ధ్య తేడా ఏమైనా ఉందా? ఒక‌వేళ లేకుండా.. అప్పుడు కేంద్రానికి అభినంద‌న‌లు తెలిపి.. ఇప్పుడు ఎందుకు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు? తొలిసారి హోదాకు బ‌దులు ప్యాకేజీ ప్ర‌క‌టించి ఉంటే.. కేంద్రానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంటే హోదా వ‌చ్చేది కాదా చంద్ర‌బాబు?

3. హోదా సాధ‌న‌లో భాగంగా గ‌డిచిన నాలుగేళ్లుగా ఎన్ని పోరాడాలు చేయ‌లేదు. అధికారంతో ఆ పోరాటాల్సి నీరుగార్చ‌లేదా చంద్ర‌బాబు? హోదా కోసం ఎనిమిది రోజుల పాటు నిరాహార‌దీక్ష చేస్తుంటే.. ప్ర‌ధాని మోడీ వ‌స్తున్నారంటూ పోలీసుల్ని పంపి.. తెల్ల‌వారుజామున టెంట్ ఎత్తేయించింది నువ్వు కాదా? నా దీక్ష‌ను ఎందుకు భ‌గ్నం చేశావ్‌? గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ మా పార్టీ హోదా సాధ‌న కోసం ధ‌ర్నాలు.. దీక్ష‌లు.. బంద్ లు నిర్వ‌హిస్తుంటే పోలీసుల్ని పెట్టి బ‌స్సులు తిప్పించిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. హోదా కోసం యువ‌త ఆందోళ‌న‌లు చేస్తే వారిపై పీడీ యాక్ట్ పెడ‌తాన‌ని బెదిరించిన వైనంపై మీ స‌మాధానం ఏమిటి చంద్ర‌బాబు?

4. హోదా సాధ‌న కోసం మేం కానీ అవిశ్వాస తీర్మానం పెట్ట‌కుంటే.. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టేవాడివా? అవిశ్వాసానికి సంఖ్య బ‌లం ఉంటే మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. త‌ర్వాతి రోజూ యూట‌ర్న్ తీసుకొని త‌మ‌కు తామే అవిశ్వాస తీర్మానాన్ని పెట్ట‌టం నిజం కాదా? మా ఎంపీల ప‌లు పార్టీల వారితో మాట్లాడి వారి చేత మాట తీసుకున్న త‌ర్వాత మాట మార్చేసి.. తాను అవిశ్వాసం పెట్టిన త‌ర్వాత అన్ని పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్ప‌టం దేనికి నిద‌ర్శ‌నం చంద్ర‌బాబు?

5. అఖిల‌ప‌క్షాన్ని పిలిచిన చంద్ర‌బాబు మ‌రో డ్రామాను ర‌క్తి క‌ట్టించారు. ఒక గ‌జ‌దొంగ దొంగ‌త‌నాల నివార‌ణ‌కు స‌ల‌హాలు ఇవ్వ‌మ‌ని మీటింగ్ పెట్టిన‌ట్లుగా ఉంది ఆయ‌న అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పిల‌వ‌టం. అఖిల‌ప‌క్షాన్ని పిలిచిన బాబు చెప్పిన కార్యాచ‌ర‌ణ ఏమిటంటే.. ఎవ‌రూ నిర‌స‌న‌లు చేప‌ట్ట‌కూడ‌ద‌ట‌. ఆందోళ‌న‌లు చేయ‌కూడ‌ద‌ట‌. విద్యార్థులు ఉద్య‌మంలోకి రాకూడ‌దు.. ఇలా ఏమీ చేయ‌కుండా.. ఉద్య‌మించ‌కుండా హోదా వ‌స్తుందా? కేవ‌లం న‌ల్ల‌బాడ్జీలు పెట్టుకొని ఆఫీసుల‌కు వెళితే.. ఢిల్లీ వాళ్లు క‌దులుతారా?

6. ఏపీ ఎంపీలంతా ఏక‌తాటిపై నిలిస్తే కేంద్రం దిగిరాదా? పార్ల‌మెంటు చివ‌రి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాం. టీడీపీతో స‌హా 25 మంది ఎంపీలు ఒక్క తాటిపై నిల‌వ‌డి రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా చంద్ర‌బాబు? బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌ర‌ట‌. కార‌ణం ఏమిటంటే.. ఆయ‌న చేసిన అవినీతిపై కేసులు పెడ‌తార‌న్న ఉద్దేశంతో త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌ర‌ట‌. అంతేకాదు.. బాబు స‌ర్కారు అవినీతిపై కేసులు పెడ‌తార‌ని.. అరెస్ట్ చేస్తార‌ని.. ఆలా చేసిన‌ప్పుడు ఆయ‌న త‌ర‌ఫు పార్ల‌మెంటులో మాట్లాడేందుకు ఎంపీలు కావాల‌ట‌. అందుకోస‌మే.. బాబు త‌న ఎంపీల చేత రాజీనామా చేయించ‌ర‌ట. స్వ‌లాభం కోసం హోదా సాధ‌న‌ను ఇలా తాక‌ట్టు పెడితే ఏమ‌నాలి?