Begin typing your search above and press return to search.

అర్చకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...ప్రతి ఒక్కరికి రూ.10 వేలు!

By:  Tupaki Desk   |   19 Jan 2021 7:40 AM GMT
అర్చకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...ప్రతి ఒక్కరికి రూ.10 వేలు!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఆదాయం లేని ఆలయాల అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5వేల గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే రూ.10వేలుగా ఉన్న భృతిని రూ.16500 చేస్తామన్నారు.

సోమవారం విజయవాడలో అర్చకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులకు వారసత్వ హక్కులు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు.అలాగే , విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి మూడుకోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లంపల్లి చెప్పారు. 700 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న స్వామి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే పునఃనిర్మించాలని నిర్ణయించారు. కొండపైన శాశ్వత నీటివసతిని కల్పించనున్నారు. ఆలయ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా హోమశాల, నివేదనశాల నిర్మించటంతోపాటు ధ్వజస్తంభం ప్రతిష్టించాలని నిర్ణయించారు

మరోవైపు అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి 13న కొత్తగా నిర్మించిన రథానికి అభిషేకం, పుర్ణాహుతి, రథప్రతిష్ట కార్యక్రమాలను దేవదాయశాఖ అధికారులు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నూతన రథానికి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేస్తారు. 11న సంకల్పం, 12న అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. 23న స్వామి ఊరేగింపును కొత్త రథంపై నిర్వహించబోతున్నారు.