Begin typing your search above and press return to search.

వైఎస్సార్ బాబు తరువాత జగన్ కే ఆ రికార్డు...?

By:  Tupaki Desk   |   8 Jun 2023 5:00 PM GMT
వైఎస్సార్ బాబు తరువాత జగన్ కే ఆ రికార్డు...?
X
ఉమ్మడి ఏపీలో చూసుకుంటే అయిదేళ్ళ కాలం పూర్తిగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ నేతలకు ఉండేది కాదు, వారి జాతకం ఎపుడూ ఢిల్లీ పెద్దల దయ మీదనే ఆధారపడుతూ వస్తూండేది. అక్కడ పెద్దలకు ఆగ్రహం కలిగితే క్షణాలలో సీటు ఖాళీ చేయాల్సి వచ్చేది. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిలను మినహాయిస్తే కాంగ్రెస్ లో అయిదేళ్ళ పాటు సీఎం లుగా చేసిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు.

ఇక తెలుగుదేశం పార్టీ పెట్టాక ఎన్టీయార్ నాలుగు సార్లు సీఎం గా ప్రమాణం చేశారు మొత్తంగా ఏడున్నర ఏళ్ల పాటు పనిచేశారు. చిత్రమేంటి అంటే ఎన్టీయార్ పూర్తి కాలం అయిదేల్ళ పాటు సీఎం గా ఎన్నడూ పాలించలేకపోయారు. ఆయన అల్లుడు చంద్రబాబు ముమ్మారు సీఎం గా పద్నాలుగేళ్ళ పాటు పనిచేసి ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ రికార్టు క్రియేట్ చేశారు.

అయితే చంద్రబాబు విభజన ఏపీలోనే అయిదేళ్ళ పాటు ఒక్క మారు మాత్రమే సీఎం గా పూర్తికాలం పనిచేశారు అని చెప్పాలి. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎం అయ్యారు. అప్పటికి ఎనిమిది నెలల పాటు ఎన్టీయార్ పాలించడంతో మిగిలిన కాలమే బాబుకు దఖలు పడింది. 1999లో రెండవసారి బాబు సీఎం అయినా 2004లో ముందస్తు ఎన్నికలకు వెల్ళి చివరి ఆరు నెలలనూ వదిలేసుకున్నారు. అలా ఆయన ఫుల్ టెర్మ్ సీఎం కాలేకపోయారు. అయితే 2014 నుంచి 2019 వరకూ మాత్రం ఆయన పూర్తి కాలం పనిచేసారు.

ఇక వైఎస్సార్ ని తీసుకుంటే ఆయన 2004 నుంచి 2009 దాకా అయిదేళ్ళ పాటు ఫుల్ టెర్మ్ పాలించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో మరోమారు ఆయనే సీఎం అయ్యారు కానీ మూడు నెలలకే మరణించారు. ఇక ఆయన తరువాత సీఎం అయిన రోశయ్య పదకొండు నెలల సీఎం గా మిగిలిపోగా, మూడున్నరేళ్ళ పాటు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా పనిచేశారు.

ఇదంతా ఎందుకు అంటే ఇపుడు పూర్తి కాలం సీఎం గా వైఎస్సార్ చంద్రబాబు తరువాత జగన్ కూడా లిస్ట్ లో చేరనున్నారు అని చెప్పడానికే. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని నిన్నటిదాకా ప్రచారం సాగింది. కానీ జగన్ దాన్ని కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని తేల్చి చెప్పారు.

అంటే 2024లో జరిగే ఎన్నికల దాకా జగనే సీఎం అన్న మాట. ఆ విధంగా చూస్తే విభజన ఏపీలో ఫుల్ టెర్మ్ సీఎం గా చేసిన రెండవ సీఎం గా, అలాగే వైఎస్సార్ బాబుల తరువాత ఏపీ చరిత్రలో ఆధునిక ఆంధ్రా రాజకీయాల్లో సీఎం గా పూర్తి కాలం కోనసాగిన చరిత్ర కూడా జగన్ దే అవుతుంది అని అంటున్నారు.

జగన్ 151 సీట్లతో యాభై శాతం ఓట్ల షేర్ తో ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజా తీర్పు పూర్తిగా తనకు అనుకూలంగా రావడమే కాదు, అద్భుతమైన మెజారిటీ దక్కడంతో పాటు తాను అయిదేళ్ళూ సీఎం గా ఉంటూ మళ్ళీ గెలవగలను అన్న ధీమా ఉండడంతోనే ముందస్తు ఎన్నికలు అన్న షార్ట్ కట్ మెదడ్స్ కి జగన్ పోవడం లేదు అంటున్నారు.

దీంతో వైసీపీలో ఖుషీ గా ఉంటే టీడీపీ లో మాత్రం కొంత నిరాశ కనిపిస్తోంది. రాజకీయాల్లో నిన్నలా నేడు ఉండదు, అందువల్ల మరో తొమ్మిది నెలల పాటు అంటే ఏమి జరుగుతుందో అన్న కలవరం టీడీపీలో ఉంది. అప్పటిదాకా పోరాటాలు చేయడం కూడా కత్తి మీద సాముగా ఉంటుంది అని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.