Begin typing your search above and press return to search.

గోదారి ఒడ్డున‌.. క‌డ‌ప‌కు మించిన ఆద‌ర‌ణ!

By:  Tupaki Desk   |   12 Jun 2018 12:43 PM GMT
గోదారి ఒడ్డున‌.. క‌డ‌ప‌కు మించిన ఆద‌ర‌ణ!
X
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర విజ‌యవంతంగా పూర్తి చేసుకున్న వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించింది. జ‌గ‌న్ రాక నేప‌థ్యంలో తూర్పుగోదావ‌రి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు ఎదురొచ్చి పూల‌వాన కురిపించారు. రైల్ కం రోడ్ బ్రిడ్జ్ మీదుగా జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తుండ‌గా కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు స్వాగతం పలికాయి.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుండి వ‌చ్చిన స్పంద‌న చూసి పోలీసుల‌తో అడ్డంకులు సృష్టించే ప్ర‌య‌త్నాలు చేశారు. మొద‌ట జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోలీసులు ఆ వంతెన మీదుగా అనుమ‌తి ఇవ్వ‌డానికి నిరాక‌రించారు. అది పాత‌కాలం వంతెన కాబ‌ట్టి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌స్తే కూలిపోయే ప్ర‌మాదం ఉందంటూ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. మ‌ద్ద‌తు దారుల‌ను వెన‌క్కు పంపించ‌డం - ముళ్ల‌కంచెలు అడ్డువేయ‌డం చేశారు. అయినా జ‌నం వెన‌క్కి త‌గ్గ‌లేదు.

జ‌గ‌న్ కు స్వాగ‌తం చెప్ప‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో వంతెన షేక్ అయితే .. అక్క‌డ చంద్ర‌బాబు షేక్ అవుతున్నాడ‌ని తూర్పు గోదావ‌రి జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు - మాజీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు ఎద్దేవా చేశారు. రాజ‌మండ్రి వంతెన మీద‌కు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వ‌స్తార‌ని - అది కూలుతుంద‌ని ప్ర‌భుత్వం నోటీసు ఇచ్చింద‌ని - కూలిపోవ‌డానికి ఇది చంద్ర‌బాబు నాయుడు క‌ట్టిన వంతెన కాద‌ని అని సెటైర్లు వేశారు.

రాజ‌మండ్రిలో 36 ఎక‌రాలు సేక‌రించి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎనిమిది వేల ఇండ్లు క‌ట్టించారు. 10 ఎక‌రాల‌ను పేద‌ల‌కు పంచారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ ప‌ది ఎక‌రాల‌ను లాక్కున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. 2014 ఎన్నిక‌ల్లో 17 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 14 మందిని గెలిపిస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల‌ను ప‌శువుల మాదిరిగా కొనుగోలు చేశార‌ని అన్నారు. ఇంత మంది ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే జిల్లాకు చంద్ర‌బాబు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెడితే అవినీతిలో చంద్ర‌బాబు రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్ చేశార‌ని ఎద్దేవా చేశారు.