Begin typing your search above and press return to search.

మేకపాటి ప్లేస్ లో అభ్యర్ధిని రెడీ చేసిన జగన్...?

By:  Tupaki Desk   |   27 March 2023 5:00 AM GMT
మేకపాటి ప్లేస్ లో అభ్యర్ధిని రెడీ చేసిన జగన్...?
X
నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లను గెలుచుకున్న వైసీపీకి ఇపుడు అక్కడే అసలైన తలనొప్పులు ఎదురవుతున్నాయి. నెల్లూరు నుంచే ముగ్గురు బలమైన రెడ్లు పార్టీకి ఎదురు తిరిగారు. వీరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 2019 ఎన్నికల ముందు వచ్చినా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి ఫ్యామిలీ. మేకపాటి రాజమోహనరెడ్డి తో పాటు ఆయన తమ్ముడు అయిన చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైసీపీ జెండా పట్టారు. అది లగాయితూ గత పుష్కర కాలంగా వైసీపీనే అట్టిపెట్టుకుని పనిచేస్తూ వచ్చారు.

మేకపాటి చంద్రశేఖరరెడ్డికి జగన్ మూడు సార్లు టికెట్లు ఇచ్చారు. ఆయన రెండు సార్లు గెలిచారు. అందులో 2012 ఉప ఎన్నిక, 2019 ఎన్నిక ఉన్నాయి. మేకపాటిని జగన్ తప్పించడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన వయసు ఏడు పదులు దాటింది. నియోజకవర్గంలో పట్టు తగ్గుతోంది. వర్గ పోరు కూడా హెచ్చుగా ఉంది. దాంతో పాటుగా ఆయన సొంత కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డితో సైతం పడడం లేదు అని ప్రచారం లో ఉంది.

దాంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో గెలవాలీ అంటే మేకపాటిని తప్పించాల్సిందే అని జగన్ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల మేకపాటి తీవ్రంగా నిరసన తెలియచేశారని అంటున్నారు. మొత్తానికి ఏమి జరిగింది అన్నది తెలిసిందే. ఇపుడు మేకపాటి టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఉదయగిరిలో టీడీపీకి మొదటి నుంచి బలం తక్కువ. పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు సార్లు మాత్రమే గెలిచింది. దాంతో వైసీపీ ఈసారి కూడా తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు కొత్త వారిని బరిలోకి దింపనుంది అంటున్నారు. రాజ్యసభ మెంబర్ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డిని ఉదయగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించవచ్చు అని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం కలిగిన నేతగా వేమిరెడ్డి ఉన్నారు.

టీడీపీ ఉదయగిరిలో పుంజుకుంది. బలమైన అభ్యర్ధినే పెట్టవచ్చు, మేకపాటికి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఒక డౌట్. ఏది ఏమైనా కూడా టీడీపీ ఎవరిని దింపినా గట్టిగా ఎదుర్కోవడానికి వైసీపీ రెడీ అవుతోంది. అందుకే వేమిరెడ్డి ఫ్యామిలీ మీదనే ఫోకస్ పెట్టిందని అంటున్నారు.

ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నుంచి దివంగత నేత, మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డిని ఇంచార్జిగా వైసీపీ నియమించింది. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నుంచి లోక్ సభ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని బరిలోకి దింపనున్నట్లుగా ప్రకటించారు. ఇపుడు ఉదయగిరి నుంచి కూడా క్యాండిడేట్ చాలా తొందరలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి మేకపాటి తన బలం ఏంటో చూపిస్తారా. తెలుగుదేశంతో జతకట్టి వైసీపీని ఓడిస్తారా అన్నది చూడాల్సి ఉంది.