Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎంను ఫాలో అవ్వబోతున్న ఏపీ సీఎం ..ఎందులో అంటే !

By:  Tupaki Desk   |   19 May 2020 12:30 PM GMT
ఢిల్లీ సీఎంను ఫాలో అవ్వబోతున్న ఏపీ సీఎం ..ఎందులో అంటే !
X
ప్రజల రక్షణే మా లక్ష్యం ...ప్రజా పాలనే మా ద్యేయం అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆ దిశగా ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసం ఎన్నో విన్నూతనమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు.. ఆ తరువాత గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లిన ప్రభుత్వం.. ఇక వైద్యాన్ని కూడా వారికి చేరువ చేయబోతుంది.

దీనితో ప్రతి గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రత్యేకంగా క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతోంది. దీనికి వైఎస్ ఆర్ గ్రామ క్లినిక్, వైఎస్ ఆర్ వార్డు క్లినిక్‌గా పేరు పెట్టబోతోంది. గ్రామ సచివాలయాల తరహాలోనే..ప్రతి విలేజ్ క్లినిక్‌ లోనూ ఓ డాక్టర్, హెల్త్ వర్కర్లను నియమించనుంది. ఈ తరహా విధానం ప్రస్తుతం ఢిల్లీ లో అమలులో ఉంది. అక్కడి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్‌ల పేరుతో ఆధునిక వైద్యాన్ని కూడా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసింది. అదే తరహాలో ఏపీలో కూడా గ్రామ, వార్డు క్లినిక్‌ లను నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నహాలను చేస్తోంది.

ఈ మహమ్మారి ప్రభావం ఇప్పట్లో తగ్గదు అని , దానితో పాటు కలిసి కొనసాగాల్సిందే అని ఇదివరకే వెల్లడించిన వైఎస్ జగన్.. అదే సమయంలో ఈ గ్రామస్థాయి క్లినిక్‌ లను అందుబాటులోకి తీసుకువస్తుండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా నెలకొల్పబోయే ప్రతి క్లినిక్‌ లో కూడా ఈ మహమ్మారి నిర్దారణ పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లను చేయబోతోంది ప్రభుత్వం. దీనికి అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకుని రానుంది. వైద్య పరికరాల కొరత ఏర్పడమంటూ జరిగితే.. 10 క్లినిక్‌ లకు కలిపి ఒక యూనిట్‌ గా తీసుకుని మహమ్మారి వైరస్ పరీక్షలను నిర్వహించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం స్పందన పేరుతో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జగన్.. ఈ క్లినిక్‌ల గురించి ప్రస్తావించారు. మహమ్మారిని ‌ నివారించడానికి అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ దానితో కలిసి జీవించాల్సి ఉంటుందనే భావనను ప్రజల్లో కల్పించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. భవిష్యత్తులో ఈ వైరస్ ప్రతి ఒక్కరికీ సోకే అవకాశాలు లేకపోలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలని, అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జగన్ అన్నారు. పరీక్షలకోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలనే సందేహాలు వారిలో ఉన్నాయని, దీన్ని నివారించడానికి రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ ను తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.