Begin typing your search above and press return to search.

3 రోజుల్లో 41 లక్షలమంది తల్లులకి అమ్మఒడి!

By:  Tupaki Desk   |   14 Jan 2020 10:48 AM GMT
3 రోజుల్లో  41 లక్షలమంది తల్లులకి అమ్మఒడి!
X
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ పథకం లక్షలాది మంది నిరుపేద తల్లుల ముంగిటకు చేరింది. అక్షరాస్యత పెంపు లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ లో ఇలాంటి పథకాన్ని చేపట్టడం గమనార్హం. ‘అమ్మ ఒడి’ని ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోనే అర్హులైన లక్షలాది మంది తల్లుల చేతికి నిధులు అందాయి. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని చిత్తూరులో ప్రారంభించారు.

పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదని - తమ చిన్నారులను బడికి పంపించే ప్రతి నిరుపేద తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించేలా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 43 లక్షల మంది తల్లులకు మేలు చేకూర్చేలా తొలి బడ్జెట్‌ లోనే అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్ల నిధులు కేటాయించారు. పథకం ప్రారంభానికి ముహూర్తాన్ని నిర్ణయించి నెల రోజుల్లోపే అర్హుల ఎంపికను పూర్తి చేశారు. అమ్మ ఒడి పథకం జనవరి 9వ తేదీన ప్రారంభం కాగా, ఆ రోజు నాటికి 42,12,126 మంది అర్హులను గుర్తించి - నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. శనివారం - ఆదివారం బ్యాంకులకు సెలవు.

సోమవారం నాటికి.. అంటే 3 పని దినాల్లోనే అమ్మ ఒడి పథకం కింద 41 లక్షల మంది పేద తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున రూ.6,150 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటిదాకా ఎంపికైన లబ్ధిదారుల్లో మిగిలిన 1,12,126 మందికి మంగళవారం నాటికి నిధులు అందనున్నాయి. వీరు కాకుండా అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా పథకం కింద ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలాంటి వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి - అర్హులుగా ఎంపికయ్యేందుకు ఫిబ్రవరి 9వ తేదీవరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇకపోతే ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు వర్తింపజేయాలని భావించినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు సైతం విస్తరింపచేశారు.