Begin typing your search above and press return to search.

ప్రోటెం స్పీకర్ గా ఎవరు?..బాబుకు జగన్ ఛాన్సిస్తారా?

By:  Tupaki Desk   |   26 May 2019 5:00 PM GMT
ప్రోటెం స్పీకర్ గా ఎవరు?..బాబుకు జగన్ ఛాన్సిస్తారా?
X
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ముగిశాయి. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి జనం బ్రహ్మరథం పట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కు చుక్కలు చూపారు. 175 సీట్లుంటే... జగన్ పార్టీకి 151 సీట్లు ఇచ్చిన జనం... టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఈ తీర్పుతో చంద్రబాబు డీలా పడిపోయారు. అసలు అసెంబ్లీలో విపక్ష నేతగా తాను కూర్చోలేనంటూ కూడా ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా వచ్చిన వార్తలు కలకలమే రేపాయి.

అయితే విపక్ష నేతగా తాను ఉండాలో, ఉండకూడదో నిర్ణయించుకునే అధికారం టీడీపీ అధినేతగా చంద్రబాబుకు ఉందనే చెప్పాలి. అయితే ఓ విషయంలో మాత్రం జగన్ నిర్ణయం తీసుకుంటే మాత్రం జగన్ చెప్పిన చోట చంద్రబాబు కూర్చోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ వాదనలోకి వెళితే... ఏపీ శాసనసభకు కొత్త సభ్యులు వచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఎంపికయ్యేదాకా ప్రోటెం స్పీకర్ గా ఎవరినో ఒకరిని నియమిస్తారు కదా. అలాంటి నియామకాల్లో సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విషయంలో పార్టీల ప్రస్తావన అంతగా పట్టించుకోరనే చెప్పాలి. ఎందుకంటే... సభ్యుల ప్రమాణం వరకే కొనసాగే ప్రోటెం స్పీకర్ గా ఎవరున్నా పెద్దగా ఒరగబెట్టేదేమీ లేదనే చెప్పాలి. ఈ లెక్కల ఆధారంగానే తెలంగాణకు తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... వైరి వర్గం కాంగ్రెస్ కు చెందిన కుందూరు జానారెడ్డిని ప్రోటెం స్పీకర్ గా కూర్చోబెట్టారు.

ఇక ఏపీ విషయానికి వస్తే.. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సభలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా చంద్రబాబే కనిపిస్తున్నారు. మరి సీనియారిటీ లెక్కలు తీస్తే... ప్రోటెం స్పీకర్ గా బాబును కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ దిశగా జగన్ ఆలోచిస్తారా? అన్నది ఇక్కడ అసలు సిసలు పాయింట్. ఒకవేళ... జగన్ కు ఈ విషయం తడితే మాత్రం... చంద్రబాబుకు పెద్ద ఇబ్బందేనని చెప్పక తప్పదు. ఎందుకంటే... సీనియర్ మోస్ట్ గా ఉన్న చంద్రబాబు మొన్నటిదాకా సీఎంగా పనిచేశారు కదా. మరి సీఎంగా పనిచేసిన నేతగా ఉన్న చంద్రబాబు... ప్రోటెం స్పీకర్ పదవిలో కూర్చోలేరు కదా. మరి జగన్ ప్రతిపాదన తెస్తారో, లేదో తెలియదు గానీ... ఈ ప్రపోజల్ వస్తే మాత్రం చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి తప్పదని చెప్పాలి.