Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సంచ‌ల‌నం!..ఆదిపై పోటీకి అభ్య‌ర్థి ఖ‌రారు!

By:  Tupaki Desk   |   14 Jan 2019 4:42 PM GMT
జ‌గ‌న్ సంచ‌ల‌నం!..ఆదిపై పోటీకి అభ్య‌ర్థి ఖ‌రారు!
X
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ... విప‌క్ష వైసీపీ త‌న‌దైన శైలి స్పీడును పెంచేసింద‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టిన ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... పాద‌యాత్ర ముగింపు సంద‌ర్బంగా ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించేశారు. అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత‌లు సాగిస్తున్న దురాగ‌తాల‌పై త‌న‌దైన శైలి కామెంట్లు సంధించిన జ‌గ‌న్‌... టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలో సాగుతున్న దుష్ట పాల‌న మ‌న‌కు అవ‌స‌ర‌మా? అంటూ ధ్వ‌జ‌మెత్తిన తీరు... వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పాద‌యాత్ర త‌ర్వాత తిరుమ‌ల వెంక‌న్నను ద‌ర్శించుకుని 14 నెల‌ల త‌ర్వాత త‌న సొంతూరు పులివెందుల చేరుకున్న జ‌గ‌న్‌కు క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గ‌డ‌చిన మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉన్న జగ‌న్‌.. ప్ర‌తి రోజూ ప్ర‌జా ద‌ర్బార్లు నిర్వ‌హించ‌డంతో పాటు త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన పార్టీ శ్రేణుల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో జిల్లాలో ఓ మోస్త‌రు ప్రాధాన్యం ఉన్న జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు కూడా జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వ‌చ్చారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ రెడ్డి... జ‌గ‌న్ ఇమేజీతోనే విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత టీడీపీ విసిరిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప‌డిపోయిన ఆది... వెంట‌నే టీడీపీలోకి జంపైపోయారు. ఆ త‌ర్వాత ఏకంగా మంత్రి ప‌ద‌వి కూడా ఆయ‌న చేప‌ట్టారు. జ‌గ‌న్‌ను దెబ్బ తీయాల‌న్న ఏకైన ల‌క్ష్యంతో సాగుతున్న టీడీపీ... అందులో భాగంగానే జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన ఆదికి మంత్రి ప‌ద‌వి ఇచ్చింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఆది పార్టీ ఫిరాయించిన నేప‌థ్యంలో జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ ప‌రిస్థితి ఏమిట‌న్న ప్రశ్న‌లు వినిపించినా... జ‌గ‌న్ ఆ ప‌రిస్థితిని క్ష‌ణాల్లోనే చ‌క్క‌దిద్దేశారు. వైద్యుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ రెడ్డిని ఆ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీగా నియ‌మించిన జ‌గ‌న్‌... పార్టీ కార్య‌క‌ర్త‌లకు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు. జ‌గ‌న్ మాటే వేదంగా ప‌రిగ‌ణించిన సుధీర్ రెడ్డి గ‌డ‌చిన మూడేళ్లుగా జ‌మ్మ‌ల‌మ‌డుగు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అండాదండాగా నిలుస్తున్నారు.

ఇక నిన్న‌టి కీల‌క స‌మావేశం విష‌యానికి వ‌స్తే... సుధీర్ రెడ్డిని జ‌మ్మ‌ల‌మ‌డుగు జ‌నాల‌కు చూపించిన జ‌గ‌న్‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు అభ్య‌ర్థి సుధీర్ రెడ్డేన‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... ఆయ‌న‌ను బంప‌ర్ మెజారిటీతో గెలిపించుకుని రావాల‌ని పిలుపునిచ్చారు. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆదిపై పోటీకి దిగే వైసీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ ఇచ్చిన జ‌గ‌న్... జ‌మ్మ‌ల‌మ‌డుగు ఓటర్ల‌లోని డైలామాకు చెక్ పెట్టేశారు. మూడేళ్లుగా నియోజక‌వ‌ర్గ వ్యాప్తంగా త‌న‌దైన రీతిలో వైసీపీ శ్రేణుల‌కు ద‌గ్గ‌రైన సుధీర్ రెడ్డి... ఆదినారాయ‌ణ రెడ్డికి గ‌ట్టిపోటీదారుగానే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అదే స‌మ‌యంలో ఇప్ప‌టిదాకా ఆదికి వెన్నుద‌న్నుగా నిలిచిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి లాంటి ప‌లువురు కీల‌క నేత‌లు కూడా ఇప్పుడు ఆదికి దూరం కావ‌డంతో పాటు సుధీర్ రెడ్డికి ద‌గ్గ‌ర‌య్యారు. నిన్న‌టి స‌మావేశంలో ఏకంగా వైసీపీలో చేరిపోయారు కూడా.

ఇక సుధీర్ రెడ్డి పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఆయ‌న ఫ్యామిలీ రాజ‌కీయాల‌కు కొత్తేమీ కాదు. తెలుగు నేల రాజ‌కీయాల్లో సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి సోద‌రుడి కుమారుడే సుధీర్ రెడ్డి. అంతేకాకుండా అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువ నేత కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డికి స్వ‌యానా బావ‌మ‌రిది. ఇలా వృత్తిప‌రంగా వైద్యుడు అయిన‌ప్ప‌టికీ సుధీర్ రెడ్డికి రాజ‌కీయాలు కొత్తేమీ కాదు. ఈ కార‌ణంగానే గ‌డ‌చిన మూడేళ్ల‌లోనే నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌డమే కాకుండా... ఆదినారాయ‌ణ రెడ్డిని ఓడించే సత్తా క‌లిగిన నేత‌గానూ ఇప్పుడు బాగానే రాటు దేలార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా ఆదికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ ర‌చించార‌న్న మాట‌.