Begin typing your search above and press return to search.

ఏపీ నుంచి దావోస్ కు ఎవ‌రూ వెళ్ల‌లేదు!

By:  Tupaki Desk   |   20 Jan 2020 5:26 AM GMT
ఏపీ నుంచి దావోస్ కు ఎవ‌రూ వెళ్ల‌లేదు!
X
దావోస్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో పాల్గొన‌డానికి ఏపీ నుంచి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎవ‌రూ వెళ్లేదు. భారీ ధ‌ర చెల్లించి ఈ స‌మావేశంలో పాల్గొన‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఈ సారి ఉత్సాహం చూపించ‌లేదు. గ‌తంలో అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యేవారు. భారీగా డ‌బ్బులు చెల్లించి ఆ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం మీద విమ‌ర్శ‌లు వ‌చ్చినా చంద్ర‌బాబు నాయుడు వెనుకాడ‌లేదు. లోకేష్ కూడా ఆ స‌మావేశానికి ఒక‌సారి హాజ‌ర‌యిన‌ట్టుగా ఉన్నారు.

ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఈ స‌మావేశం ప‌ట్ల అంత ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో ఈ ఏడాది దావోస్ లు ఏపీ నుంచి ఎవ‌రూ హాజ‌రు కాన‌ట్టుగా ఉంది.

తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ త‌ర‌ఫున మాత్రం ఈ స‌ద‌స్సుకు హాజ‌రీ ఉంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ వెళ్లారు. స్విస్ లో జ‌రుగుతున్న ఈ స‌ద‌స్సులో పాల్గొంటూ ఉన్నారు. అలాగే క‌ర్ణాట‌క సీఎం య‌డియూర‌ప్ప కూడా ఈ స‌మావేశంలో పాల్గొన‌డానికి వెళ్లారు. క‌ర్ణాట‌క‌ - తెలంగాణ‌ల ఆర్థిక ప‌రిస్థితి ఏపీ క‌న్నా చాలా మెరుగ్గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారీగా ఖ‌ర్చు చేసి వారు ఈ స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డంలో వింత లేదు.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న వేళ ఆర్థిక ప‌రిస్థితితో నిమిత్తం లేకుండా దావోస్ కు వెళ్లే వారు. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ అంటూ చెప్పే వారు. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం ఆ స‌ద‌స్సు గురించి ఏ మాత్రం ఆస‌క్తి చూపిన‌ట్టుగా లేదు. ప్ర‌స్తుతం ఏపీ ప్రభుత్వం రాజ‌ధాని విష‌యంలో క‌స‌ర‌త్తును సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.