Begin typing your search above and press return to search.

ఇదేం పని జగన్?!

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:24 AM GMT
ఇదేం పని జగన్?!
X

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారం అచ్చివచ్చినట్లు అయింది. తనను అవినీతిపరుడంటూ ఇన్నాళ్లు విమర్శించిన టీడీపీని ఆడుకునేందుకు జగన్ కు భారీ అస్త్రం దొరికింది. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ర్ట గవర్నర్ మొదలుకొని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు జగన్ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.

రాష్ర్టపతికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ ఆయన్ను కలిసిన అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును సైతం కలిశారు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఒక రైలు నడపవలసిన అవసరం గురించి. ఏపీ రైల్వే సమస్యలపై, ఇతర హామీల గురించి జగన్ వినతిపత్రం అందచేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..జగన్ చేసిన మరో పని ఆసక్తికరంగా, ఒకింత జగన్ రాజకీయ అవగాహనను బయటపెట్టేలా ఉంది.

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఎలా రెడ్ హాండెడ్ గా దొరికింది వివరిస్తూ సురేష్ ప్రభుకు వినతిపత్రం అందచేశారు. అసలు ఓటుకునోటు వ్యవహారాలతో రైల్వే మంత్రికి ఏం సంబందమూ ఉండదు. కానీ ఢిల్లీ వరకూ వెళ్లాం కదా...ప్రతి మంత్రికి ఒక కాపీ ఇస్తే పోయే అన్నట్లుగా జగన్ వ్యవహరించారా లేకపోతే.... ఎవరికి ఇవ్వాలో లేదో కూడా తెలియకుండా అడుగువేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన ప్రత్యర్థి అయిన చంద్రబాబు ప్రతిష్టను ఎంత మంది వద్ద వీలైతే అంత మంది వద్ద దెబ్బతీయాలని భావించి ఈ వినతిపత్రం ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.