Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు భ‌యం క‌నిపిస్తున్న‌ట్లుంది

By:  Tupaki Desk   |   26 Feb 2016 12:49 PM GMT
జ‌గ‌న్‌ కు భ‌యం క‌నిపిస్తున్న‌ట్లుంది
X
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత జగన్...తెలుగు రాజ‌కీయాల్లో ఇపుడు హాట్‌ టాపిక్‌ గా మారిన నేత‌. వైసీపీ నుంచి వ‌రుస‌బెట్టి ఎమ్మెల్యేలు జంప్ అవుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ వైఖ‌రి ఇపుడు ఆసక్తిక‌రంగానే కాదు ఆశ్చ‌ర్య‌క‌రంగా కూడా మారింది. ఇంట్లో మ‌నిషి లాంటి భూమా నాగిరెడ్డి లాంటి వాళ్లే జంప్ అయ్యి అధికార‌ప‌క్షం వైపు చేరిపోతుంటే...పార్టీ క్యాడ‌ర్‌ కు ధైర్యం చెప్పాల్సింది పోయి జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌ కు చెక్కేశాడు. జ‌గ‌న్ ఇలా హ‌స్తినా బాట ప‌ట్ట‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చినప్ప‌టికీ త‌ను అనుకున్న షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాతే ఆయ‌న రాష్ర్టానికి తిరిగివ‌చ్చారు.

ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ త‌న పోస్ట్‌మార్ట‌మ్ మొద‌లుపెట్టారు. ముందుగా సొంత జిల్లాలో ఎదుర‌వుతున్న చిక్కుల‌ను చ‌క్కదిద్దేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త‌మ కుటుంబ ఇలాకా అయిన‌ పులివెందులలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో జ‌గ‌న్ సమావేశమై ప‌రిస్థితులపై చర్చించారు. అధికార టీడీపీలో పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా చేరుతుండటంపై ఎమ్మెల్యేలతో జ‌గ‌న్ చ‌ర్చించారు. తాజాగా గుంటూరు - ప్రకాశం - జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల గురించే జ‌గ‌న్ మాట్లాడుతార‌నేది తెలిసిందే. నాయ‌కులెవ‌రూ పార్టీని వీడొద్దని, భవిష్యత్ మనదేనని పార్టీ ఎమ్మెల్యేలకు జ‌గ‌న్ ధైర్యం నూరిపోయ‌నున్నార‌ని స‌మాచారం.

అయితే జ‌గ‌న్ పార్టీని కాపాడుకునేందుకు జ‌గ‌న్ ఆప‌రేష‌న్ చాలా ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌యింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. సొంత మ‌నిషి అయిన భూమాకు కండువా తెలుగుదేశం కండువా క‌ప్పిన‌పుడే జ‌గ‌న్ కిమ్మ‌న‌క‌పోవ‌డంతో...ప్ర‌తిప‌క్ష నేతను లైట్ తీసుకున్నార‌ని దాని ఫ‌లిత‌మే క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఎమ్మెల్యే జంపింగ్ అని చెప్తున్నారు. ఇదంతా జ‌రిగిన నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక భేటీ ఏ మేర‌కు ఫ‌లిత‌మిస్తుందో చూడాలి మ‌రి.