Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ శతజయంతి : కేసీయార్, జగన్ ఏం చేయబోతున్నారు...?

By:  Tupaki Desk   |   18 May 2022 5:30 PM GMT
ఎన్టీయార్ శతజయంతి : కేసీయార్, జగన్ ఏం చేయబోతున్నారు...?
X
ఎన్టీయార్ దేశం గర్వించే మహా నటుడు. అంతే కాదు, ఆయన గొప్ప ప్రజా నాయకుడు. కాదూ కూడదు వీలు పడదు అన్న మాటలు వినిపించే ప్రభుత్వ వ్యవస్థను ఆయన సమూలంగా మార్చేశారు. మనసు ఉంటే ఏదైనా చేయవచ్చు అని చాటి చెప్పిన మహనీయుడుగా తెలుగు జాతి ఆయనను చూస్తుంది. ఎన్టీయార్ రాజకీయం ఒక విప్లవం. ఆయన ప్రతీ అడుగూ ఒక సంచలనం.

ఆయన ఎందరికో స్పూర్తి. మార్గదర్శి. ఈ రోజు దేశమంతా సంక్షేమ కార్యక్రమాలు విసృతంగా అమలు చేస్తున్నారు అంటే దాని వెనక ఉన్నది ఎన్టీయార్ అనే చెప్పాలి. ఎంటీయార్ ది మూడున్నర దశాబ్దాల సినీ జీవితం. పద్నాలుగేళ్ళ రాజకీయ జీవితం.

ముమ్మారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో కాంగ్రెస్ కి ఆల్టర్నేషన్ గా నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చేలా చూశారు. ఒక విధంగా జయప్రకాష్ నారాయణ్ తరువాత విపక్షాలను కుడి ఎడమ తేడా లేకుండా కలిపిన మేటి నాయకుడు ఎన్టీయార్ అని చెప్పాలి.

ఆయన పాలనలో తీసుకున్న అనే కీలక నిర్ణయాలు ఈ రోజుకూ దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. పేదలకు ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టిన ఘనత కూడా అన్న గారిదే. ఆయన తెలుగు జాతికి నిలువెత్తు సంతకం. ఆయన తెలుగు వారి పౌరుషం. మద్రాసీలుగా అంతదాకా పిలవబడుతున్న తెలుగు వారికి ప్రత్యేక ఉనికిని తెచ్చి ఢిల్లీ పీఠానికి తెలుగు సత్తా చాటిన ఘనాపాటి.

మరి ఎన్టీయార్ ఈ గడ్డ మీద పుట్టి వంద ఏళ్ళు నిండుతున్నాయి. ఆయన 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని నిమ్మకూరులో పుట్టారు. 1996 జనవరి 18న ఈ లోకాన్ని భౌతికంగా వీడిపోయారు. దాదాపుగా ఏడున్నర పదుల జీవితాన్ని చూసిన ఎన్టీయార్ తన ప్రతీ చర్యతోనూ తెలుగు జాతిని తట్టిలేపారు.

ఒక విధంగా ఆయన తెలుగు వారి ఆస్తిగానే చూడాలి. ఎన్టీయార్ రాజకీయ నాయకుడే కానీ ఆయనకు రాజకీయాలు లేవు, తెలియవు. అందువల్ల ఆయనను అందరూ గౌరవించాల్సిన సందర్భం ఇది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలను పార్టీ పరంగా టీడీపీ నిర్వహిస్తుంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాలూ కూడా ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా అధికారికంగా నిర్వహించడం సముచితం. ఆయనకు ఆ విధంగా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా తెలంగాణా విషయానికి వస్తే కేసీయార్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ లో ప్రారంభించినా ఎన్టీయార్ పిలుపు మేరకు టీడీపీలో చేరి అక్కడే ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఆయనకు ఎన్టీయార్ తోనూ తెలుగుదేశం పార్టీతోనూ ఎంతో అనుబంధం ఉంది. ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ అధినాయకుడు స్వర్గీయ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలని ఏడాది పాటు నిర్వహించి తనకు పార్టీల భేదం లేదని కేసీయార్ నిరూపించుకున్నారు. ఇపుడు అన్న గారి శతజయంతి వేడుకలను కూడా ఆయన అధికారికంగా నిర్వహిస్తే తెలంగాణా సమాజం యావత్తు సంతోషిస్తుంది.

ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ అధికారంలో ఉంది. జగన్ కి ఎన్టీయార్ అంటే ప్రత్యేకంగా అభిమానం ఉంది. ఆయన ఎన్టీయార్ ని సందర్భం దొరికిన ప్రతీసారి గొప్పగా గుర్తు చేసుకుంటారు. ఈ మధ్యనే విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టి తన రాజనీతిని చాటుకున్న జగన్ ఎన్టీయార్ శత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తే ఇంకా గొప్పగా ఉంటుందని అంటున్నారు.

ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి కూర్చుని ఆ తెలుగు వల్లభుడికి వందేళ్ల పండుగ వేళ ఇతోధికంగా గుర్తుకు తెచ్చుకునే కార్యక్రమాలు చేస్తే భావి తరాలకు ఎన్టీయార్ స్పూర్తి అందుతుంది. తెలుగు తేజం ఖ్యాతి మరింతగా విస్తరిస్తుంది. ఆ దిశగా ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ అడుగులు వేస్తారని అంతా ఆశిస్తున్నారు.