Begin typing your search above and press return to search.

వైసీపీని వీడినా ఎమ్మెల్యే గిరి ఊడరాదు..ఆనం ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2019 7:14 AM GMT
వైసీపీని వీడినా ఎమ్మెల్యే గిరి ఊడరాదు..ఆనం ప్లాన్ ఇదేనా?
X
సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన వార్తలు చూస్తుంటే... నిజంగానే ఆసక్తి రేకెత్తుతోంది. టీడీపీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆనం బ్రదర్స్... ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి, ఆపై మళ్లీ టీడీపీలోకి వచ్చి, మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేరిపోయారు. కాంగ్రెస్ లో ఉండగా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆనం రామనారాయణ రెడ్డి... నల్లారి కేబినెట్ లో ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం... ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ కలకలం రేగగా... కాస్తంత లోతుగా తరచి చూస్తే... ఆనం మార్కు వ్యూహం అర్థమవుతుందన్న వాదన వినిపిస్తోంది.

సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ - నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి - అనిల్ కుమార్ యాదవ్ లే లక్ష్యంగా మొన్న ఆనం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరులో రౌడీ రాజ్యం నడుస్తోందని, ఆ రౌడీ రాజ్యాన్ని ఆపే దమ్మున్న అధికారే లేరని, అలాంటి అధికారులు వచ్చినా... వెంటనే బదిలీ అయిపోతున్నారని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద చిచ్చునే రేపాయని చెప్పాలి. అంతేకాకుండా టీడీపీ నేత బీద మస్తాన్ రావు వైసీపీలో చేరుతున్న క్రమంలోనే ఆనం నోట నుంచి ఈ మాటలు రావడం గమనార్హం. ఏదో అలా యధాలాపంగా ఆనం నోట నుంచి ఈ మాటలు రాలేదని - పక్కా వ్యూహంతోనే ఆనం ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సీనియర్ అయిన తనను కాదని, అనిల్ కు మంత్రి పదవి ఇవ్వడంపై ఆనం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఈ క్రమంలోనే ఆయన నోట నుంచి అనిల్ - శ్రీధర్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యాఖ్యలతో ఎలాగూ అధిష్ఠానం తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుందని - పార్టీలో అంతర్గత క్రమశిక్షణపై జగన్ కూడా కాస్తంత సీరియస్ అవ్వడం ఖాయమేనన్న పక్కా అంచనాతోనే ఆనం ఈ వ్యాఖ్యలు చేసినట్లగా తెలుస్తోంది. అయినా అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎవరైనా వణికిపోతారు కదా? మరి ఆనం అధిష్ఠానం తనపై కోపం ప్రదర్శించాలని ఎందుకు కోరకుంటారు? ఎందుకంటే... అలా చేస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, దాంతో వైసీపీ నుంచి దక్కిన ఎమ్మెల్యే గిరీని అనుభవిస్తూనే ఇతర పార్టీల్లోకి జంప్ కావచ్చన్నది ఆనం ప్లాన్ అంట. నిజమే మరి... ఆనం వ్యాఖ్యలపై జగన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా అవసరమైతే నోటీసులు జారీ చేయాలని - ఇంకా అవసరమైతే... సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారట. తనకు ప్రాధాన్యం దక్కని చోట ఉండరాదన్న భావనతో ఆనం పక్క పార్టీల వైపు చూస్తున్నారట. ఇదే క్రమంలో మొన్నామధ్య తిరుపతి వచ్చిన చంద్రబాబును ఆనం రహస్యంగా కలిశారట. ఈ విషయం జగన్ కూ చేరిపోయిందట. ఆ విషయం తెలుసుకున్న ఆనం... ఇలా తనపై సస్పెన్షన్ వేటు పడేలా వ్యూహం రచించుకున్నారట. మరి ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.