Begin typing your search above and press return to search.

మోడీ ఉండగా.. అదానీపై విచారణ కల్లా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 4:35 PM GMT
మోడీ ఉండగా.. అదానీపై విచారణ కల్లా?
X
దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలోనే గుజరాత్ వ్యాపారిగా ఉన్న గౌతం అదానీ దేశంలోనే అపర కుబేరుడిగా ఎదిగాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.. ప్రపంచంలోనే ఇప్పుడు టాప్ 4 ధనవంతుడిగా మారాడని అంటుంటారు.. ప్రభుత్వ కాంట్రాక్టులు, పోర్టులు, సహజవనరులు అన్నీ పొందేసి లాభపడ్డారని.. మోడీ ఫ్రెండ్ కావడంతో ఆయాచితంగా మేలు చేశారని ఒక విమర్శలు ఉన్నాయి.. అయినప్పటికీ దేశంలోని బీజేపీని.. ఆ వర్గం దేశ భక్తులను కాదని ఎవరూ నోరు మెదపని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

తాజాగా గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్.. స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని.. అకౌంటింగ్ మోసాలతో షేర్ల విలువను విపరీతంగా పెరిగేలా చేసిందని హిండెన్ బర్గ్ సంచలన నివేదికను విడుదల చేసింది . రెండేళ్ల పాటు పరిశోధన చేసి మరీ రిపోర్ట్ ను ప్రచురించింది. దీంతో ఇన్వెస్టెర్ల సెంటిమెంట్ దెబ్బతింది. పెద్ద ఎత్తున అదానీ షఏర్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా రెండు రోజులుగా దారుణంగా పతనమవుతున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్‌లలో రూ.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది.

అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.19.40 లక్షల కోట్ల నుంచి రూ.15.30 లక్షల కోట్లకు పడిపోయింది. శాతం పరంగా కోత 25 శాతం. అదానీ గ్రూప్ ఏసీసీ మరియు అంబుజా సిమెంట్స్‌తో సహా 9 లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉంది. ఈ ఒక్కో స్టాక్‌లో సగటు పతనం 20 శాతం. ఎఫ్ అండ్ ఓ విభాగంలో నాలుగు కంపెనీలు ఉన్నాయి. ఆరు కంపెనీలు 20 శాతానికి పైగా పడిపోయాయి; రెండు కంపెనీలకు కేవలం 5 శాతం సర్క్యూట్ మాత్రమే ఉంది.

అయితే హిండెన్ బర్గ్ ఇంత ఆరోపణలు చేసినా అదానీ నేరుగా స్పందించడం లేదు.మోడీ ప్రభుత్వం కూడా కిక్కురుమనడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా కోర్టుల్లో దావా వేస్తే అసలు గుట్టును ఇద్దరూ బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అదానీకి దేశంలో మోడీ సర్కార్ అండతో వేల కోట్లను బ్యాంకులు అప్పులు ఇచ్చి ఇతోదికంగా సాయం చేశాయన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అదానీ షేర్లను తనఖా పెట్టుకున్న బ్యాంకులు ఈ విషయం లీక్ అయితే మునిగిపోతాయి. అదానీ కంపెనీలు నేరుగా వ్యాపారం చేసేలా పరిమితం చేస్తే వాస్తవ విలువకు.. షేర్ విలువకూ పొంతన ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అదానీ వల్ల కుప్పకూలిపోతుంది.

ఇండియా లో ఎంత డిమాండ్ చేసినా అదానీపై విచారణ కష్టమే. అదానీకి ఉన్న పొలిటికల్ పవర్ అలాంటిది. కానీ బయటపెట్టకపోతే ఆర్థికంగా మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. మరి మోడీ సర్కార్ ఈ విషయంలో ఏం చేస్తుందన్నది వేచిచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.